Salaar:ప్రతి సెషన్ ముందు ఇద్దరం మాట్లాడుకునే వాళ్లం:ప్రభాస్
Salaar:భారతీయ సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా `సలార్`. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యంత భారీ స్థాయిలో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కిన మూవీ ఇది. `కేజీఎఫ్` సిరీస్ సినిమాలతో దర్శకుడిగా సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ సారి అంతకు మించి అంటూ `సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్`తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా కాలం తరువాత మరో పవర్ ఫుల్ పాత్రలో నటించిన మూవీ కావడం, ప్రభాస్ లాంటి క్రేజీ హీరోతో ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడు తోడవ్వడంతో ప్రేక్షకుల్లో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో టీమ్ ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచేసింది. ఇప్పటికే చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ సినిమా గురించి పలు ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాల్నివెల్లడించారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరో ప్రభాస్ ఈ సినిమా గురించి ఏం మాట్లాడబోతున్నారా? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ హీరో ప్రభాస్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ `సలార్`పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“సలార్` సినిమాలోని పాత్రల మధ్య లోతైన భావోద్వేగాలుంటాయి. ప్రేక్షకులు ఇప్పటి వరకు నన్ను చూడని సరికొత్త పాత్రలో చూడబోతున్నారు. నేను, ప్రశాంత్ నీల్ కలిసి పని చేయాలనుకున్నప్పుడు సినిమా ఎలా ఉంటే అందరినీ ఆకట్టుకుంటుందనే విషయాలపై కలిసి చర్చించాం. నా మైండ్‌లో ఉన్న ఆలోచనలను ఆయన ముందు పెట్టాను. దానికి ఏం చేయాలనే విషయాన్ని చర్చించాం. నేను చెప్పిన ఆలోచనల్లో కొన్ని ప్రశాంత్‌కు నచ్చాయి.ప్రతి సెషన్ ముందు ఇద్దరం మాట్లాడుకునే వాళ్లం. తను నా పాత్రను ఎలా చూపించాలనుకుంటున్నారనే విషయాలను తను నాకు వివరించేవాడు. ఇద్దరం కలిసి వర్క్ షాప్స్ చేశాం. సరదాగా సినిమా పూర్తి చేశాం.
నేను సినీ జర్నీని ప్రారంభించి 21 ఏళ్లు అవుతున్నాయి. తనతో ఎప్పుడు షూటింగ్ చేస్తానా అని ఆసక్తిగా ఎదురుచూశాను. నా 21 ఏళ్ల కెరీర్లో నేను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. `సలార్` షూటింగ్‌కు ఎప్పుడు పిలుస్తారా అని ఆత్రుతపడ్డా. నా కెరీర్లో ఎప్పుడూ ఇలా అనుకోలేదు. ఆరు నెలలు తన ఫోన్ కోసం ఎదురుచూశా. సినిమా షూటింగ్ ప్రారంభమైన నెలరోజుల్లోనే ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. ప్రశాంత్ హీరోలను గొప్పగా చూపించాలనుకునే దర్శకుడు. సినిమా షూటింగ్ సమయాన్ని తను రిలాక్స్డా నా సమయానికి తగ్గట్లుగా చేసుకుంటూ వచ్చాడు. ఇక నాతో పాటు శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా అందరం సెట్స్‌లో కలిశామంటే చాలా సరదాగా గడిచిపోయేది.
మా ఎంజాయ్మెంట్కి అడ్డే ఉండేదికాదు. నేను ఎప్పుడూ షాట్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఏర్పడలేదు. ప్రశాంత్ అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. మేం వెయిట్ చేస్తామని చెప్పినా అతను వినలేదు. ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకునేవాడు. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎప్పుడు సెట్స్‌లోకి అడుగు పెట్టానో గుర్తు లేదు. అయితే నేను ఎంటర్ అవగానే అంతా ఆపేసి హీరో సన్నివేశాలను చిత్రీకరించడానికి టీమ్ సిద్ధమయ్యేది. తను అంతలా నన్ను కేరింగ్‌గా చూసుకున్నారు. `సలార్` సినిమాలో నా పాత్ర కోసం నేనేం ప్రత్యేకంగా కష్టపడలేదు. క్యారెక్టర్ డిమాండ్ మేరకు కండలు పెంచాలని ప్రశాంత్ ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టే నేను మారాను. అది నాకు సాధారణమైన విషయం మాత్రమే. గత 21 ఏళ్లలో నేను మారిన దానితో పోల్చుకుంటే ఈ సినిమా కోసం జరిగిన మార్పులు చాలా సాధారణమైన విషయమే` అని తెలిపారు ప్రభాస్.