Salaar:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్ సీజ్ ఫైర్`. క్రేజీ డైరెక్టర్‌గా `కేజీఎఫ్` సిరీస్ సినిమాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ ఏడాది `ఆదిపురుష్`తో నిరాశ పరిచిన ప్రభాస్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో దేశ వ్యాప్తంగా `సలార్`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇటీవల 3 నిమిషాల 47 సెకన్ల నిడివితో ట్రైలర్‌ని విడుదల చేసి కథని, అందులోని ప్రధాన పాత్రలని దర్శకుడు పరిచయం చేయడంతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
ప్రభాస్ అభిమానులు, సినీ లవర్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న`సలార్ సీజ్ ఫైర్` డిసెంబర్ 22న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలని చిత్ర బృందం పూర్తి చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో సినిమా రన్ టైమ్, సెన్సార్ సర్టిఫికెట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. దీంతో `సలార్` మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ `ఏ` సర్టిఫికెట్ జారీ చేసింది. దీని రన్ టైమ్ 2 గంటల 55 నిమిషాలు. ఆ మధ్య కాలంలో ఈ తరహా రన్ టైమ్ ఉన్న సినిమాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. దీంతో నెట్టింట `సలార్` రన్ టైమ్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. `సలార్`పై ఉన్న నమ్మకంతో టీమ్ రన్ టైమ్ విషయంలో ఎలాంటి కంగారు పడటం లేదని, అదే ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. ఈ తరహా రన్ టైమ్‌లో అప్పట్లో `అర్జున్ రెడ్డి`, ఇటీవల `యానిమల్` సినిమాలు వచ్చాయి. బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్నాయి.
ఇదిలా ఉంటే ..`సలార్`లోని కీలక ఘట్టాలు, హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు రన్ టైమ్‌ని మరిపించి ప్రేక్షకులకు సరికొత్త అనూభూతిని కలిగిస్తాయని టీమ్‌తో పాటు ప్రభాస్ అభిమానలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న `సలార్` ఫస్ట్ పార్ట్‌ని `సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్` పేరుతో డిసెంబర్ 22న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్‌లో యాక్షన్ ఘట్టాలు ఏ రేంజ్‌లో ఉండనున్నాయో చూపించారు. ట్రైలరే ఇలా ఉంటే సినిమాలో ఊచకోత గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది.
`కేజీఎఫ్` సిరీస్‌లలో యష్‌కు మాస్ ఎలివేషన్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ `సలార్`లో ప్రభాస్‌కు అంతకు మించిన ఎలివేషన్స్ ఇచ్చారని తెలుస్తోంది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలోని కీలక పాత్రల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబి సింహా, టినూ ఆనంద్, రామచంద్రరాజు, శ్రియారెడ్డి, ఈశ్వరీ రావు, జాన్ విజయ్, మైమ్ గోపీ నటిస్తున్నారు.