Henley Passport Index : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితా-2024 తాజాగా విడుదల చేశారు. వీటిలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ ఉన్నాయి. మంగళవారం విడుదలైన ‘హెన్లీ పాస్ పోర్ట్ సూచీ’ రిపోర్ట్ లో ఈ ఆరు దేశాలు మొదటి స్థానంలో నిలిచాయి. 227 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది.
తొలి స్థానంలో నిలిచిన ఆరు దేశాల పాస్ పోర్టులతో ఏకంగా 194 దేశాలకు ముందస్తు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు. గత ఐదేండ్లుగా ఈ జాబితాలో సింగపూర్, జపాన్ మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ ఏడాది వీటితో పాటు మిగతా 4 దేశాలు కూడా తొలి స్థానంలోకి వచ్చాయి. రెండో స్థానంలో దక్షిణ కొరియా, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నిలిచాయి. వీటి పాస్ పోర్ట్ తో 192 దేశాలకు ముందస్తు వీసా లేకుండా వెళ్లవచ్చు. ఇక బ్రిటన్ ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. ఈ దేశ పాస్ పోర్ట్ తో 191 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు.
ఇక ఈ జాబితాలో మన దేశం 80వ స్థానంలో నిలిచిందని చెప్పుకున్నాం. మన దేశ పాస్ పోర్ట్ తో 62 దేశాలకు ప్రయాణం చేయవచ్చు. నిరుడు 59 దేశాలకు మాత్రమే ముందస్తు వీసా లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉండేది. అప్పుడు మన దేశం 85వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 5 స్థానాలను మెరుగుపరుచుకుంది.
ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో(104) నిలిచింది. ఆ దేశ పాస్ పోర్ట్ తో 28 దేశాలు మాత్రమే ముందస్తు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఇక పాకిస్తాన్ ఆ దేశంలో మూడు స్థానాలు మాత్రమే మెరుగ్గా ఉంది. 101వ ర్యాంకుకే పరిమితమైంది. ఇక దశాబ్ద కాలంగా యూఏఈ పాస్ పోర్ట్ 55 నుంచి 11వ స్థానానికి ఎగబాకింది. ఉక్రెయిన్, చైనా 21 స్థానాలు మెరుగుపరుచుకున్నాయి. చైనా 62వ స్థానంలో, ఉక్రెయిన్ 32వ స్థానంలో ఉన్నాయి. రష్యా 51వ ర్యాంకులో ఉంది. ఈ దేశ పాస్ పోర్టుతో 119 దేశాలకు ముందస్తు వీసా లేకుండా వెళ్లవచ్చు.