Gottipati Ravikumar : ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ: మంత్రి గొట్టిపాటి రవికుమార్
Gottipati Ravikumar : ఆక్వా రైతులకు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా విద్యుత్ రాయితీ వర్తింపజేయడంపై ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఈ రంగానికి మేలు చేయాలన్నదే తమ ధ్యేయమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ ఫార్మర్ల ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. ధర తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆక్వా రైతులకు మేలు చేసేందుకు ఇంకా ఏం చేయాలో ఆలోచిస్తున్నామని, హేచరీల సమస్యలపై దృష్టి సారించామన్నారు.
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగంలో సంక్షేమం మెండుగా ఉంది. నాన్ ఆక్వా జోన్, ఆక్వా జోన్ అన్న తేడా లేకుండా ప్రతి మత్స్య రైతుకూ యూనిట్ విద్యుత్ పై రూ.2 రాయితీ ఇచ్చిందని అన్నారు. వైసీపీ హయాంలో ఆక్వా రంగాన్ని జోన్ లుగా విభజించారు. రూ.1.50 యూనిట్ రాయితీ వర్తింపజేసేందుకు మొదట 5 ఎకరాలు పరిమితి విధించారని, ఎన్నికల ముందు 10 ఎకరాలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో 46,329 మంది రైతులకు రాయితీ అందగా, వైసీపీ పాలనలో ఆ సంఖ్య 31 వేలకు పడిపోయిందని మంత్రి వెల్లడించారు.