Deputy CM Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్ లోని తన క్యాంప్ ఆఫీసులో వేద మంత్రోచ్ఛరణలు, పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. జనసేన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పవన్ చేతికి అధికారం రావడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్గ్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్ కు అభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ను కలిసినవారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు.