Postal Ballot : ఏపీ లో పోస్టల్ బ్యాలెట్ పట్టు తప్పిందా ???
Postal Ballot : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వెల్లడికి ముహూర్తం ఖరారు అయ్యింది. మరి కొద్దీ గంటల్లో అభ్యర్థుల జాతకాలను కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పడానికి సిద్దమైనది. పోటీలో ఉన్న అభ్యర్థులు జాతకాల కోసం ఎదురుచూస్తున్నారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కొందరు అభ్యర్థులు. మరికొందరు గెలుపు ధీమాలో ఉన్నారు. ఈవీఎం లో అభ్యర్థుల పరిస్థితి ఒకలా ఉంటె, పోస్టల్ బ్యాలెట్ లో మరొక తీరు ఉంది. తాజా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులకు గురయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. వారంతా కూడా ప్రభుత్వం పై వ్యతిరేకతతో ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
పోలింగ్ ముగిసిన అనంతరం వైసీపీ పోస్టల్ బ్యాలెట్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. గత ఎన్నికల కంటే అధికంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్నికల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల పైబడి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలినట్టుగా కమిషన్ గణాంకాలు చెబుతున్నాయి. నియోజకవర్గానికి నాలుగు వేల ఓట్లు పోలినట్టుగా వైసీపీ నేతలు గుర్తించారు. దింతో వైసీపీ అభ్యర్థుల్లో గుబులు మొదలైనది. ఎందుకంటే ఉద్యోగ, ఉపాధ్యాయులంతా వ్యతిరేకంగా తయారయ్యారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ నేతలకు గుబులు మొదలు కావడంతో ఈసీ నుంచి మొదలుకొని రాష్ట్ర హై కోర్ట్ వరకు అభ్యర్థులు వెళ్లారు. గతంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఏ పార్టీ కూడా కనీసం ఏసీ వరకు కూడా ఫిర్యాదుతో వెళ్ళలేదు. ఇప్పుడు వైసీపీ నేతలు వెళ్లి చరిత్ర సృష్టించారు. నిబంధనల పేరుతొ ఎన్నికల కమిషన్, హై కోర్ట్ కు వెళ్లడం చుస్తే పోస్టల్ ఓట్లు వైసీపీ అభ్యర్థులను ఎంత భయానికి గురిచేస్తున్నాయి చెప్పాల్సిన అవసరం లేదు.
2019 ఎన్నికల్లో వైసీపీ నేతలు నాలుగువేల ఓట్ల తేడాతో 15 స్థానాల్లో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో 2019 పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల్లో కలవరం మొదలైనది.