Chandrababu : పదవి అంటే బాధ్యత.. వాటితో మంచి చేయండి.. నామినేటెడ్ నేతలకు చంద్రబాబు శుభాకాంక్షలు
Chandrababu : రాష్ట్రంలో రెండో జాబితాలో నామినేటెడ్ పదవులు పొందిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. నామినేటెడ్ పోస్టుల తొలి జాబితాలో 20 చైర్మన్ పోస్టులు, ఒక వైస్ చైర్మన్ పోస్టును భర్తీ చేసిన ప్రభుత్వం… రెండో జాబితాలో 62 మందికి చైర్మన్ పదవులు, సలహాదారు పదవులు ఇచ్చింది. సుదీర్ఘ ప్రక్రియ తర్వాత… పదవుల కోసం వచ్చిన 30 వేల దరఖాస్తులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి వివిధ పదవులకు నేతలను ఎంపిక చేశారు. వీటిలో 60 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పోస్టులు కాగా… కేబినెట్ హోదా కలిగిన రెండు అడ్వైజర్ పోస్టులు ఉన్నాయి. పదవులు పొందిన వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సంకీర్ణ ప్రభుత్వంలో మీకు మంచి అవకాశాలు వచ్చాయి. మనది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పుకున్నాం. పొలిటికల్ గవర్నెన్స్ ను దృష్టిలో ఉంచుకుని నామినేటెడ్ పదవులకు మిమ్మల్ని ఎంపిక చేశాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజల కోసం చేసే మంచి పనుల్లో మీరు కూడా భాగస్వాములు కావడమే. దీనివల్ల క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా మరింత ఖచ్చితత్వంతో ప్రజలకు సేవ చేసే అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఇచ్చిన పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి…. పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి’ అని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.