TTD : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యత లేకపోవడంతో తమిళనాడులోని దిండిగల్ కు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఆదేశించింది. ఆ సంస్థకు 8.50 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసే బాధ్యతను గతంలో టీటీడీ అప్పగించింది. ఇప్పటి వరకు 68 వేల కిలోల నెయ్యిని సరఫరా చేసింది. అయితే, అందులో 20 వేల కిలోల నెయ్యి నాణ్యత లేకపోవడతో టీటీడీ వెనక్కి పంపించింది.
అడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా భక్తులకు అందించాలనే ఉద్దేశంతో ఈవో జె.శ్యామలరావు ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై చర్యలకు ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి సేకరణ నిపుణుల కమిటీతో సమీక్ష నిర్వహించారు. టీటీడీకి అందుతున్న నెయ్యి నమూనాలను ల్యాబ్ లో పరీక్షించగా, ఐదుగురు సరఫరాదారుల్లో ఒకరు సప్లై చేసిన నెయ్యి నాణ్యతా ప్రమాణాలకు సరిపోలేదని తెలిసంది. దీంతో కల్తీ సరఫరాదారును నిర్ధారించిన నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశాలు జారీచేశారు.