Pollution : దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలో శీతాకాలం, పండుగలు సమీపిస్తుండడంతో వివిధ రాష్ట్రాల్లోని వైద్యారోగ్య శాఖలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉదయపు నడక, క్రీడలు వంటి వాటికి దూరంగా ఉండాలని పేర్కొంది. ఇప్పటికే శ్వాసకోశ, హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు కాలుష్యం ఎక్కువగా ఉండే సమయాల్లో బహిరంగ కార్యకలాపాలను తగ్గించాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
వాయు కాలుష్యం తీవ్రతరమై అనారోగ్య పరిస్థితులకు దారితీస్తోంది. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో క్రీడలు ఆడటం, ఉదయపు నడకకు వెళ్లడం వంటివి పరిమితం చేయాలని తెలిపింది. ముఖ్యంగా గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, ట్రాఫిక్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ పరిస్థితుల్లో ‘వాతావరణ మార్పు-మానవులపై ప్రభావం’ జాతీయ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు అవగాహన కలిగించాలని, వాయు కాలుష్య సంబంధిత వ్యాధులను ట్రాక్ చేసే నిఘా వ్యవస్థలో భాగస్వామ్యాన్ని పెంచాలని తెలిపింది.