Polling In Telangana Modi In AP : వ్యూహ, ప్రతి వ్యూహాలు పన్నడంలో కమలం పార్టీ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో ఉంటుందని ప్రతీ భారతీయుడికి తెలిసిందే. దేశాన్ని అంగబలం, ఆర్థిక బలంలో ప్రపంచ పటంలో మొదటి ప్లేస్ లో నిలబెట్టేందుకు వ్యూహాలు పన్నుతూనే దేశంలో, రాష్ట్రాల్లో తన పార్టీని పవర్ లోకి తెచ్చుకునేందుకు స్కెచ్ వేస్తుంటుంది కమలం పార్టీ.
ఇందులో భాగంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున ప్రధాని మోడీ పక్క రాష్ట్రం ఉత్తరాఖండ్ లో మకాం వేశాడు. ఆ రాష్ట్ర ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన ఆయన పోలింగ్ రోజు మాత్రం పక్క రాష్ట్రంలో ఆలయంలో పూజలు, తదితర షెడ్యూల్ పెట్టుకున్నారు. ఆ సమయంలో మోడీ పర్యటన వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ పోలింగ్ పై ఎంతో కొంత ప్రభావం పడింది.
ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఉండబోతున్నారు. ఈ మేరకు ఆయన 28, 29, 30 తేదీల్లో తిరుమల టూర్ నిర్వహించనున్నట్లు సమాచారం ఉంది. 28వ తేదీన తెలంగాణ ప్రచారానికి చివరి గడువు. ఆ రోజున ఆయన తెలంగాణలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ తర్వాత నేరుగా తిరుపతికి వెళ్లే అవకాశం ఉంది.
29వ తేదీ (బుధవారం) తిరుపతిలో పూజలు, శ్రీవారి దర్శనం, తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. తెలంగాణ పోలింగ్ డే (నవంబర్ 30) తేదీన తిరుమలలో ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. తిరుపతిలో కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించే అవకాశం ఉంది.
30వ తేదీ మధ్యాహ్నం ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. అంటే దాదాపు మధ్యాహ్నం వరకు చాలా వరకు పోలింగ్ శాతం పూర్తవుతుంది. ఆ సమయానికి కంటే ముందే ఆయన తిరుపతిలో ప్రచారం చేస్తారు. ఆయన పర్యటన పోలింగ్ పై ప్రభావం చూపుతుందని ఆరోపణలు వచ్చినా మోడీ వాటిని పట్టించుకోవడం లేదు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సమయంలో ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఇక ప్రకటనకు సంబంధించి అధికారికంగా రెండు మూడు రోజుల్లో ప్రకటన వెలువడుతుంది.