Madhya Pradesh Assembly Elections : కొనసాగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
Madhya Pradesh Assembly Elections : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్య ప్రదేశ్ లో ఒకే విడుతలో పోలింగ్ జరుగుతుండగా.. ఛత్తీస్ గఢ్ లో రెండు విడుతలుగా జరుగుతుంది. ఇందులో భాగంగా రెండో విడుత ఈ రోజు ప్రారంభమైంది.
అధికారిక లెక్కల ప్రకారం ఉదయం 11 గంటల వరకు 28 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నానికి ఓటింగ్ పెరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా, బాలాఘాట్ జిల్లాలోని బైహర్, లాంజీ, పార్స్వారా అసెంబ్లీ స్థానాలు, మరికొన్ని చోట్ల మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగియనుంది.
230 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. కొద్దిసేపటి క్రితం శివరాజ్ సింగ్ చౌహాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరోవైపు ఛత్తీస్ గఢ్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. నవంబర్ 7న మొదటి దశలో 20 స్థానాలకు పోలింగ్ జరగ్గా, మిగిలిన 50 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. 2003 నుంచి 2018 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఉవ్విళ్లూరుతోంది.