Polling Day : మందుబాబులు హైదరాబాద్ నగరంలో మరో 12 గంటలు ఆగక తప్పదు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు మే 11 తేదీ సాయంత్రం నుంచి మే 13 తేదీ ఆరు గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. దీంతో మందుబాబులు ముందే మూడు రోజులు సరిపడా మందును స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు. దీంతో పాటు ఆయా రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు మందు ను ముందుగానే తీసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మరో 12 గంటల పాటు మందు అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా మే 13 సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికలు ముగియగానే వైన్స్ షాపులు, బార్లు తెరుచుకోవచ్చని ముందు తెలిపిన ఉత్తర్వుల్లో చెప్పినప్పటికీ ఈ రోజు సాయంత్రం తెరవడానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు చెప్పారు. ఈ నిషేధం మంగళవారం ఉదయం వరకు కొనసాగుతుందని చెప్పారు. ఇది కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం అని వెల్లడించారు.
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తాగుడుకు అలవాటు పడిన వారు.. ఎన్నికల్లో ఎలాంటి గొడవలకు పాల్పడకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మందుబాబులపై, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై చాలా కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా.. మాధవీ లత హైదరాబాద్ నుంచి పోటీ చేస్తుండగా.. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్, మల్కాజిగిరి బరిలో సునీత మహేందర్ రెడ్డి, హైదరాబాద్ లో ముస్లిం నాయకుడికి టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ మాత్రం మల్కాజిగిరి లో రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ ను పోటీలోకి దించి పోటీకి సై అంటో సై అంటోంది.