AP Polling : ఏపీలో అర్ధరాత్రి వరకు కొనసాగిన పోలింగ్.. అత్యధిక ఓటింగ్ ఎవరికి చేటు
AP Polling : ఎట్టకేలకు ఏపీలో ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 68 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు క్యూ కట్టారు. దీంతో సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న వారికి ఎన్నికల అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా దాదాపు 3500కుపైగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కొనసాగింది. దీంతో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. రాత్రి 11 గంటల వరకు కూడా పలు చోట్ల పోలింగ్ కొనసాగింది. విశాఖ జిల్లాలో దాదాపు 135 పోలింగ్ కేంద్రాల్లో అర్దరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. పలు పోలింగ్ కేంద్రాల్లో అర్దరాత్రి తర్వాత కూడా పోలింగ్ కొనసాగడం గమనార్హం.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని భూపతిపల్లెలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి వరకూ వేచివుండి 200 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ అర్దరాత్రి వరకు కొనసాగడంతో పోలింగ్ శాతం 80 శాతం వరకు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇక, పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ.. ప్రజలు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండా, వానలను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. హైదరాబాద్ నగరం నుంచి కూడా భారీ సంఖ్యలో ఏపీకి తరలివచ్చి తమ ఓటును వేశారు. కాగా, నేడు అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన సమాచారాన్ని పరిశీలించి పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని మంగళవారం వెల్లడిస్తామని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
ఇది ఇలా ఉంటే ఈ సారి భారీ ఎత్తున పోలింగ్ నమోదు కావడంతో కొందరు రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యాల కారణంగా ఈ సారి ఎలాగైనా గద్దె దించాలని జనాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అటు కూటమి కూడా వైసీపీ ఆగడాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయినట్లు ఈ పోలింగ్ ను బట్టి అర్థమవుతుంది. దీంతో ఈ సారి కూటమి గెలుపు ఖాయమని అర్థమవుతుంది.