Ambati Rambabu : తన రెండో అల్లుడు డా. గౌతమ్ వీడియో వెనుక జనసేన అధినేత పవన్ ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయనను రెచ్చగొట్టి ఈ వీడియో చేయించారని అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాంబాబు మాట్లాడారు.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తనను ఇబ్బంది పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ కలిసి డ్రామాలాడుతున్నారని పేర్కొన్నారు. తన రెండో కుమార్తె డా. మనోజ్ఞ, అల్లుడు డా. గౌతమ్ మధ్య నాలుగేళ్లుగా విభేదాలు ఉన్నాయని తెలిపారు. రెండేళ్లుగా మనోజ్ఞతో పాటు ఆమె కుమార్తె, కుమారుడు తన సంరక్షణలోనే ఉన్నారని, వారికి అల్లుడి నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని చెప్పారు. తన అల్లుడు వ్యాఖ్యలు చేస్తే తను పట్టించుకోనని, అతడి వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడని ఆరోపించారు. ఎవరి కుటుంబంలో విభేదాలు లేవని ప్రశ్నించారు. ‘‘చిరంజీవి గారూ.. మీ తమ్ముడికి చెప్పండి, మీ కుటుంబంలో గొడవలు లేవా..?’’ అని ప్రశ్నించారు.