JAISW News Telugu

Police Smugglers : పోలీసులే గంజాయి స్మగ్లర్లు.. ఇదేం పోయేకాలం.. తిట్టుకుంటున్న జనాలు!

Police Smugglers

Police Smugglers

Police Smugglers : నేరాలను అరికట్టాల్సిన పోలీసులే నేరగాళ్లుగా మారిపోతున్నారు. కొంత మంది అడ్డదారులు తొక్కి డిపార్ట్ మెంట్ కు చెడ్డపేరు తీసుకొస్తున్నారు.  ఏపీలోని ఇద్దరు పోలీసులు ఉద్యోగానికి సెలవు పెట్టి గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడ్డారు. వీరిని గంజాయి ప్యాకెట్లతో హైదరాబాద్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

హెడ్ కానిస్టేబుళ్లు సాగర్ పట్నాయక్(35), కానిస్టేబుల్ శ్రీనివాస్(32) పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ మూడో బెటాలియన్ లో పనిచేస్తున్నారు. నెలనెలా వచ్చే జీతంతో జీవితం హాయిగా సాగిపోతున్నా ఈజీ మనీ కోసం అక్రమార్జనకు పూనుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ ద్వారా లక్షలకు లక్షలు ఆర్జించాలని ఆశతో ఈ ఇద్దరు పోలీసులు స్మగ్లర్లుగా మారారు.

అనారోగ్య కారణాలతో పోలీసు ఉద్యోగానికి సెలవు తీసుకున్న సాగర్ , శ్రీనివాస్ నర్సీపట్నంలో గంజాయి సేకరించారు. ఈ ఇద్దరు కలిసి కారులో గంజాయిని హైదరాబాద్ కు తరలించారు. అయితే ఈ గంజాయి స్మగ్లింగ్ పై పక్కా సమాచారం అందుకున్న బాలా నగర్ ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. అర్ధరాత్రి వారిద్దరూ బాచుపల్లికి చేరుకోగానే వారిపై దాడి చేసి అనుమానంతో వారి మారుతి ఎకో వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో 22 కేజీల గంజాయి, 11 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సాగర్, శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

విచారణలో వారు చెప్పిన వివరాలను విని పోలీసులు అవాక్కయారు. వారిద్దరూ పోలీసులని, ఆరోగ్యం బాలేదని చెప్పి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని విచారణలో తేలింది. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి రూ.8లక్షల విలువ చేస్తుందని పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వదలేసి ఇలా చట్టవ్యతిరేక పనులు చేయడం ఎందుకని జనాలు తిట్టుకుంటున్నారు. ఇలాంటి వారిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Exit mobile version