Police officer : గతేడాది అమెరికాలో ఒక పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం తెప్పించింది. 2023, జనవరిలో వేగంగా వెళుతున్న పోలీస్ కారు ఢీకొని ప్రవాస విద్యార్థిని జాహ్నవి కందుల మరణించింది. ఆ సమయంలో వాహనం నడిపిన పోలీస్ అధికారి నవ్వుతూ మరో పోలీస్ తో మాట్లాడడం అతని బాడీ కెమెరాలో రికార్డయ్యింది. ఆయన నవ్వడంపై ఇటు భారత్ తో పాటు చాలా దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అయితే ఈ కేసులో ఆయనను విధుల నుంచి తొలగించినట్లు సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తాత్కాలిక పోలీసు చీఫ్ సూరహర్ బుధవారం (జూలై 17) ప్రకటించారు. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ మా టీములో ఉండేందుకు నేను అనుమతించడం లేదు. ఆయన వ్యవహారం మొత్తం డిపార్ట్‌మెంట్‌కు అప్రతిష్ట తెచ్చిపెట్టింది అన్నారు.
అసలు ఏం జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని, కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల అమెరికాలో ఈశాన్య విశ్వవిద్యాలయంలోని సీటెల్ క్యాంపస్‌లో మాస్టర్స్ చదువుతోంది. జనవరి 23, 2023న మార్క్ క్రాసింగ్ వద్ద ఆమె రోడ్డు దాటుతుండగా పోలీస్ అధికారి ఆడెరర్ పోలీస్ వాహనంలో వేగంగా వచ్చి కందులను ఢీకొట్టాడు. యాక్సిడెంట్ సమయంలో సదరు పోలీస్ అధికారి తన సహోద్యోగులతో బాడీక్యామ్ లో నవ్వుతూ మాట్లాడిన ఫుటేజీ సెప్టెంబర్ 11, 2023న విడుదలైంది. దీనిపై అప్పట్లో చర్యలు తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.
‘ఇంటెంట్ వర్సెస్ ఇంపాక్ట్’ను ఎలా బ్యాలెన్స్ చేయాలనే విషయంలో ఇది చాలా కష్టమైన తీర్పు అని పోలీసు చీఫ్ రహర్ అన్నారు. పోలీసు అధికారి ఆడెరర్ యొక్క ‘క్రూరమైన వ్యాఖ్యలు, నిష్కపటమైన నవ్వు’ కందుల కుటుంబాన్ని మరింత ఆవేదనకు గురి చేశాయని పోలీస్ చీఫ్ చెప్పారు. దీంతో శాఖపై ప్రజలకు నమ్మకం పోయిందని, విచారణ అనంతరం ఆయనను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు.