Appalaraju : మాజీ మంత్రి అప్పలరాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు
Appalaraju : మాజీమంత్రి సీదిరి అప్పలరాజుపై తాజాగా పోలీసులకు కేసు నమోదైంది. గతంలో చంద్రబాబు మానసిక పరిస్థితిపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రసంగిస్తూ చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదని అన్నారాయన. ఒక వైద్యుడిగా ఆ విషయాన్ని తాను ధ్రువీకరిస్తున్నానన్నారు. చంద్రబాబును ఆస్పత్రికి పంపి మానసిక పరిస్థితి బాగైన తర్వాత అసెంబ్లీలోకి అనుమతిస్తే బాగుంటుందని చెప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారినా ప్రతిపక్ష టీడీపీ సైలెంట్ గానే ఉంది. ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడంతో పాత విషయాలన్నీ బయటకు తీస్తున్నారు.
చంద్రబాబుపై సీదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే శిరీష, పలువురు టీడీపీ నేతలు మాజీ మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలు చర్చించే శాసనసభలో అప్పలరాజు నోరు పారేసుకున్నారని, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే శిరీష అన్నారు.