Minister Jaishankar : పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ఎప్పటికీ భారత్ దేనని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పీవోకేలో జరుగుతున్న ఆందోళనలపై కోల్ కతాలో బుధవారం (మే 15) జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్ స్పందించారు. పీవోకేలో ఉన్న ప్రజలు తమ జీవన ప్రమాణాలు, జమ్మూకాశ్మీర్ లో ఉన్న ప్రజల జీవన స్థితులతో పోల్చుకుంటున్నారన్నారు.
పీవోకేలో ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్నాయని, వాటికి గల కారణాలను విశ్లేషించడం అంత సులభం కాదన్నారు. అయితే, పీవోకే ప్రజలు తమ జీవన పరిస్థితులను జమ్మూకాశ్మీర్ ప్రజల జీవన ప్రమాణాలతో పోల్చుకుంటున్నారని నా అభిప్రాయం. తాము వివక్షకు గురవుతున్నామని పీవోకే ప్రజలు భావిస్తున్నట్లున్నారని జైశంకర్ అన్నారు.
ఇటీవల ఆహారం, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని పీవోకే ప్రజలు ఆందోళన చేశారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులపై దాడికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.