Pocharam Srinivas : పోచారం ఇన్.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక.. బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ
Pocharam Srinivas : సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సీనియర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరగా.. పార్లమెంటు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ లోకి ఎక్కువ మంది వెళతారని ప్రచారం జరిగింది. అయితే ఏకంగా నిజామాబాద్ జిల్లా సీనియర్ లీడర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా చేసి ఇలా పార్టీ మారడం బీఆర్ఎస్ కు కోలుకోలేని ఎదురు దెబ్బగా భావిస్తున్నారు.
బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్లమెంటు ఎన్నికల వరకు పోచారం బీఆర్ఎస్ పార్టీని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దగ్గరుండి నడిపించారు. బీఆర్ఎస్ నుంచి మరో 11 మంది ఎమ్మెల్యేలు చేరనున్నారని తెలుస్తుండగా.. బీఆర్ఎస్ నుంచి అంతకంటే ఎక్కువ మంది వెళ్లే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల లోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎక్కువ మందిని చేర్చుకుని ఇక్కడ బలంగా చేసుకోవాలని భావిస్తున్నారు. లేకపోతే అటు బీజేపీలో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఏ కుయుక్తులు పన్ని ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉండే అవకాశం ఉందని ఆలోచించిన సీఎం గేట్లు ఎత్తారు. ఎవరూ పార్టీలోకి వస్తామన్న సరే వద్దనే పరిస్థితుల్లో లేరు.
స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఏదైనా జరగొచ్చని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్ నుంచి వలసలు ఇంకా కొనసాగుతాయని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి స్వయంగా వచ్చి ఆహ్వానించడంతో కాంగ్రెస్ లో చేరడం లాంఛనమే అయినా.. అందరూ కలిసి ఒకే వేదికపై చేరాలని దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.