PM SHRI Scheme : ప్రభుత్వ బడులను ఆదర్శంగా తయారు చేయడంలో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) పథకానికి తెలంగాణ రాష్ట్రం నుంచి మరో 251 సర్కారు స్కూళ్లు ఎంపికయ్యాయి. వీటిలోని టీచర్లు, స్టూడెంట్లకు పలు సౌకర్యాలను కల్పించనున్నారు. గత ఏడాది తెలంగాణ నుంచి 543 స్కూళ్లు ఈ స్కీంకు ఎంపిక కాగా, ఈ ఏడాది మరిన్ని బడులు ఎంపికయ్యాయి. పీఎం శ్రీ స్కీం కింద రెండో విడతలో ఎంపికైన 251 స్కూల్లకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై ఢిల్లీలో ప్రైమరీ మీటింగ్ జరిగింది.
ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సమగ్ర శిక్ష ఎస్పీడీ మల్లయ్యభట్టు నేతృత్వంలో రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా ఎంపికైన పాఠశాలల్లో వసతుల కల్పన కోసం రూ.300 కోట్లతో ప్రతిపాదనలను కేంద్రం ముందు పెట్టారు. ఆయా బడుల్లో చదివే పిల్లలకు బ్యాగులు, సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్, అడిషనల్ రూమ్స్, ల్యాబ్స్, వివిధ యాక్టివిటీస్ కోసం నిధులు ఇవ్వాలని కోరారు. దీనిపై ఈ నెల 28న ఫైనల్ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశం ఢిల్లీలో నిర్వహించనున్నారు. దీంట్లో కేంద్రం ఎన్ని నిధులు కేటాయిస్తుందనే దానిపై స్పష్టత రానున్నది. పీఎంశ్రీకి ఎంపికైన 251 బడుల్లో 195 హైస్కూల్లు, 44 ప్రైమరీ స్కూల్లు, 12 అప్పర్ ప్రైమరీ స్కూల్లున్నాయి. పీఎంశ్రీ స్కీం కింద తొలి విడతలో 2023-24 విద్య సంవత్సరానికి ఎంపికైన 543 బడుల్లో డెవలప్ మెంట్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.