PM Modi : రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీపై పీఎం మోదీ విమర్శలను తీవ్రం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాను లాక్కొని తన ఓటు బ్యాంకు వర్గానికి కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఆరోపిస్తూ లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఎన్డీయే అభ్యర్థులకు మోదీ తాజాగా వ్యక్తిగత లేఖలు రాశారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా వారిని ప్రోత్సహించాలని పార్టీ శ్రేణులకు లేఖలో సూచించారు.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు విభజనవాద, వివక్షపూరిత ఆలోచనలతో ఉన్నాయని మోదీ ఆరోపించారు. పేదల సంపదను తీసుకెళ్లి ఓటుబ్యాంకు వర్గాలకు ఇస్తామని, వారసత్వ పన్నును తిరిగి తీసుకొస్తామని అంటున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు దేశం ఏకం కావాలని ఆ లేఖల్లో పిలుపునిచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో ఆయనను అత్యంత విలువైన కార్యకర్తగా ప్రశంసించారు.