PM Modi : మరో వారం రోజుల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం, రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక జరుగనుంది. ఈ వేడుక కోసం ప్రధాని మోదీ సహ కోట్లాది హిందువులు ఎంతో ఆసక్తిగా, భక్తపారవశ్యంతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దేశమంతా రామాయణ సంబంధిత, అయోధ్యాపురి విశేషాలపై ఆసక్తకర కథనాలు వెలువడుతున్నాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలు కూడా చేస్తున్నారు. ఇక ప్రధాని మోదీ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టి రాముడి సేవకు పునరంకితమయ్యారు.
తాజాగా హిందూ ఇతిహాసం రామాయణంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఏపీలోని లేపాక్షిలోని వీరభద్ర ఆలయాన్ని ప్రధాని మోదీ ఇవాళ సందర్శించారు. సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత జటాయు అనే పెద్ద డేగ ఆమెను అనుసరించిన ప్రదేశం లేపాక్షి అని హిందువుల నమ్మకం.
రావణుడితో పోరాడి మరణిస్తున్న జటాయువు సీతా దేవి అపహరణ గురించి కీలకమైన సమాచారాన్ని రాముడికి అందిస్తుంది. లేపాక్షిలోనే పడి చనిపోతుంది. ఇక్కడే రాముడిచే ‘మోక్షం’ అనే దైవిక విముక్తిని పొందుతుంది.
అయోధ్యలోని రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు కొద్ది రోజుల ముందుగా ప్రధాని దక్షిణాదిలోని రామాయణ ఇతిహాసానికి సంబంధించిన ఆలయాలను సందర్శిస్తున్నారు.
కొచ్చిన్ షిప్ యార్డు లిమిటెడ్ లో న్యూ డ్రై డాక్ తో పాటు ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీతో సహ అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ దక్షిణాదిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నేటి నుంచి ఏపీ, కేరళ రాష్ట్రాల్లో రెండు రోజుల పర్యటన చేస్తున్నారు. బుధవారం కేరళలోని గురువాయూర్, త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాల్లో ప్రధాని మోదీ ప్రార్థనలు చేస్తారని పీఎంవో వర్గాలు తెలిపాయి.
కాగా, అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. హాజరైన అందరికీ రామయ్య దర్శనం లభించేలా ఏర్పాట్లు చేశారు. ఇక మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొంచిన రామ్ లల్లా విగ్రహాన్ని ప్యానల్ ఎంపిక చేసింది. వీటినే రామాలయంలో ప్రతిష్ఠిస్తారు. ముగ్గురు శిల్పులు చెక్కిన విగ్రహాల్లో యోగిరాజ్ రూపొందించిన నల్లరాతి రామ్ లల్లాను ప్యానల్ ఎంపిక చేయడం విశేషం.