PM Modi : సందేశ్ ఖాలీ బాధితులతో ప్రధాని మోదీ భేటీ..? ఆ రోజే కలువనున్నారా?

PM Modi

PM Modi

PM Modi : పశ్చిమ బెంగాల్ లోని సందేశ్ ఖాలీ ఘటనలో బాధిత మహిళలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలుసుకోనున్నట్లు సమాచారం. వచ్చే నెల 6న బరాసత్ లో బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో మోదీ పాల్గొంటారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సుకాంత మజుందార్ తెలిపారు. ఒకవేళ సందేశ్ ఖాలీలోని మాతృమూర్తులు, సోదరీమణులు ప్రధాని మోదీని కలువాలనుకుంటే అందుకు ఏర్పాట్లు చేస్తామని కూడా ఆయన చెప్పారు.

గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సందేశ్ ఖాలీ ఘటన తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ ఘటన గురించి సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ..బీజేపీ నిరసనకారులను రెచ్చగొడుతోందని ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనను కలకత్తా హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్ ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, అతడి అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, భూములు ఆక్రమించారని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. బాధిత మహిళలకు మద్దతుగా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో హింస చెలరేగడంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

ఆ తర్వాత బాధితులను కలిసేందుకు వెళ్తుండగా చోటుచేసుకున్న ఘర్షణల్లో బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ గాయపడ్డారు. దీంతో ఆయన లోక్ సభ సచివాలయానికి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన లోక్ సభ సెక్రటేరియట్ ప్రివిలేజస్ కమిటీ.. పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులకు నోటీసులు సైతం జారీ చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ లోక్ సభ సెక్రటేరియట్, బీజేపీ ఎంపీ సుకాంత, కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది.

మరో వైపు ఈ హింసలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న షాజహాన్ షేక్ ను పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం విస్మయం కలిగిస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్. శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుడిని రక్షిస్తున్నారా లేదా అన్న విషయం తెలియదు కానీ, అతడిని మాత్రం ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసింది. ఇలాంటి నేపథ్యం ఉన్న సందేశ్ ఖాలీ బాధితులను ప్రధాని కలువడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

TAGS