Modi Focus : దక్షిణాదిపై పీఎం ఫోకస్..ఈసారి ఎలాగైనా..
Modi Focus : దక్షిణాదిలో పట్టు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. కాస్తో కూస్తో పట్టు ఉందంటే అది తెలంగాణలోనే. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా తన పట్టు నిలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే బహిరంగసభ, రోడ్ షోలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రభావం చూపించాలని చూస్తున్నారు. ఇదివరకే చిలుకలూరిపేటలో గతంలో నిర్వహించిన బహిరంగ సభతో మంచి స్పందన రావడంతో మళ్లీ ఇక్కడ కాలు మోపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ ఫొటో లేదని ఇది బీజేపీకి ఇష్టం లేదని ప్రచారం చేస్తోంది వైసీపీ. తాము బీజేపీతో ఉంటామని వైసీపీ చెబుతోంది. బీజేపీ గట్టిగా విమర్శించడం లేదంటే మాపై కోపం లేదని వైసీపీ నమ్ముతోంది. వారి నమ్మకాన్ని మోదీ కాపాడతారో లేక షాక్ కు గురి చేస్తారో చూడాల్సిందే. మే 6,8 తేదీల్లో ప్రధాని పర్యటన ఖరారైంది.
మోదీ ఈ నెల 6,8 తేదీల్లో రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో కలిసి ప్రచారం చేయనున్నారు. మే 6న రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో బహిరంగసభ నిర్వహిస్తారు. తరువాత అనకాపల్లిలో రోడ్ షో లో పాల్గొంటారు. మే 8న పీలేరు అసెంబ్లీ పరిధిలో కలికిరి వద్ద బహిరంగ సభలో మాట్లాడతారు.
ఇదివరకే తెలంగాణలోని మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ ఆంధ్రాలో పర్యటించి అక్కడ కూడా బీజేపీ ప్రభావం చూపించాలని తాపత్రయపడుతున్నారు. దక్షిణాదిలో పట్టు దొరికితే బాగుంటుందనే ఉద్దేశంతోనే బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.
మోదీ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో కర్ణాటకలో పాగా వేయాలని చూసినా కుదరలేదు. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లపై ఫోకస్ పెడుతోంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లో ఈ సారి కొన్ని సీట్లు తెచ్చుకోవాలని కంకణం కట్టుకుంది.