Pitapuram Nageswara Rao : పిఠాపురం నాగేశ్వరరావు అనగానే ఇప్పుటి తెలుగు ప్రేక్షకులకు ఎవరికీ తెలియకపోవచ్చేమో.. కానీ ఆయన తెలుగు సినిమాల్లో ఎన్నో పాటలను పాడారు. అందరికీ బాల సుబ్రమణ్యం మాత్రమే తెలుసు. కానీ పిఠాపురం నాగేశ్వరరావు మంచి మంచి తెలుగు పాటలు పాడారన్న విషయం ఎవరికీ తెలియకపోవచ్చు. ఈయన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో మే 5, 1930న జన్మించారు. వీరి తల్లిదండ్రులు అప్పయమ్మ, విశ్వనాథం. ఈయన ఇంటి పేరు పాతర్ల గడ్డ అయినప్పటికీ ఊరుపేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు.
పిఠాపురం నాగేశ్వరరావు తొలిసారి పాడిన పాట మంగళసూత్రం సినిమాలోనిది. అప్పటికీ ఆయన వయసు 16 సంవత్సరాలే. పాతికేళ్ల పాటు ఆయన సినిమా రంగంలో అనేక పాటలు పాడారు. ముఖ్యంగా ఘంటశాలతో కలిసి ఆయన పాడిన పాట తెలుగు సినీ చరిత్రలోనే హైలెట్. మా ఊళ్లో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది అనే పాటను అవేకళ్లు సినిమాలో పాడారు.
మాధవిపెద్ది అనే సీనియర్ గాయకుడితో కలిసి అయ్యయో జేబులో డబ్బులు పోయెనే అయ్యయో జేబులు ఖాళీ ఆయేనే అని పాట పాడి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. చిత్తూరు నాగయ్య లాగే ఈయన కూడా ఊరు పేరుతో ఫేమస్ అయ్యాడు. పిఠాపురం నాగేశ్వరరావు పాడిన కొన్ని పాటలు జీవితంలో మరిచిపోలేనివి. డివ్వి డివ్వి డివ్విట్టం.. నువ్వంటేనే నాకిష్టం.. అనే పాట దాగుడు మూతలు సినిమాలో 1964 లో పాడగా.. ఇప్పటికీ ఆ పాటకు ఫ్యాన్స్ ఉన్నారు.
మాయ సంసారం తమ్ముడు (1956) ఉమా సుందరి చిత్రం, అబ్బబ్బ చలి భలే రంగడు (1969) సోడా సోడా ఆంధ్రా సోడా (1967) లక్షి నివాసం ఇలా చెప్పుకుంటూ పోతే పిఠాపురం నాగేశ్వరరావు పాడిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్లే. ఇలాంటి గాయకుడి గురించి తెలుగు ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్ద గాయకులతో కలిసి పాడిన విధానం చిన్న గాయకులను సైతం కలుపుకుని పోయే తత్వంతో ఏ పాటైనా పాడితే అది ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా గానం చేశారు. పిఠాపురం నాగేశ్వరరావు 1996 మార్చి 5న మరణించారు.