Pindam Movie Telugu Review:`పిండం` మూవీ రివ్యూ
Pindam Movie Review:నటీనటులు:శ్రీరామ్, ఖుషీ రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.
కథ:సాయి కిరణ్ దైదా, కవి సిద్ధార్ధ
సంగీతం:కృష్ణ సౌరభ్ సూరంపల్లి
నిర్మాత:యశ్వంత్ దగ్గుమాటి
దర్శకత్వం:సాయి కిరణ్ దైదా
హారర్ కథాంశం నేపథ్యంలో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద దాదాపుగా విజయాన్ని సాధించినవే. అయితే ఇటీవల భారీ పాన్ ఇండియా సినిమాల ప్రభావం పెరిగిన దగ్గరి నుంచి హారర్ థ్రిల్లర్ సినిమాలకు కాస్త ఆదరణ తగ్గింది. అయితే ఆమధ్య విడుదలైన `మసూద`, ఇటీవల కమెడియన్ సత్యం రాజేష్ హీరోగా నటించిన `మా ఊరి పొలిమేర 2` వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని సాధించడంతో మళ్లీ హారర్ సినిమాలకు మంచి ఊపొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం `పిండం` పేరుతో మరో హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. `ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్` అనే క్యాప్షన్‌తో విభిన్నమైన కథ, కథనాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు భయపెట్టింది? ఏ స్థాయిలో ఉంది అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథేంటీ?:
అన్నమ్మ (ఈశ్వరీరావు) తన తండ్రిద్వారా అబ్బిన తాంత్రిక జ్ఞానంతో ఎంతో మందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలిలో పసిగట్టి, వాటి నుంచి విముక్తి కలిగిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్‌నాథ్(అవసరాల శ్రీనివాస్) అన్నమ్మ దగ్గరికి వస్తాడు. ఆ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలోని తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంథోనీ కుటుంబం కథ అది. సుక్లాపేట్‌లోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్‌గా పనిచేసే ఆంథోనీ(శ్రీరామ్), తన భార్య మేరీ (ఖుషీ రవి), పిల్లలు సోఫీ, తారలతో కలిసి ఊరి చివరలో ఉన్న ఓ ఇంటిని కొని అందులో చేరతాడు.
ఆ ఇంట్లోకి వెళ్లిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అంతా ఆత్మల భారీన పడి ఇబ్బందులకు గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్లాలని నిర్ణయించుకున్నా ఆ ఆత్మలు వారిని వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంథోనీ కుటుంబానికి ఎలా విముక్తి లభించింది?..ఆ ఆత్మల గతం ఏమిటన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
నటీనటుల నటన:
శ్రీరామ్, ఖుషీ రవి మధ్యతరగతి జంటగా మ పాత్రల్లో సరిగ్గా సెట్టయ్యారు. హారర్ ప్రధానంగా సాగే సన్నివేశాల్లో శ్రీరామ్ నటన ఆకట్టుకుంటుంది. ఖుషీ రవి గర్భవతిగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా తన పాత్ర పరిధిమేరకు బాగా చేసింది. ఇక అన్నమ్మగా ఈశ్వరీరావు పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఈ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. తాంత్రిక శక్తులున్న మహిళగా ఈశ్వరీరావు నటన మెప్పిస్తుంది. ఇక శ్రీరామ్, ఖుషీ రవిల పిల్లలుగా నటించిన వారు సినిమాకు మరింత కీలకంగా నిలిచారు. తారగా నటించిన అమ్మాయి మూగసైగలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇక ఇందులో అవసరాల శ్రీనివాస్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం కనిపించలేదు. రవివర్మతో పాటు నటించిన మరి కొంత మంది తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల తీరు:
చూడ్డానికి చిన్న సినిమానే అయినా సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. ఇలాంటి కథకు ప్రధాన బలంగా నిలిచే సినిమాటోగ్రఫీ, సంగీతం విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. శబ్దాలతోనే సంగీత దర్శకుడు చాలా వరకు భయపెట్టాడు. కళాదర్శకుడు విష్ణు నాయర్ కళా నైపుణ్యం తెరపై కనిపిస్తుంది. దర్శకుడు భయపెట్టే సన్నివేశాలను బాగా రాసుకున్నాడు. నిర్మాణం పరంగా ఎలాంటి లోపాలు కనిపించవు.
ఎలా ఉందంటే!:
గతంలో హారర్ సినిమాలకు కామెడీని జోడించి ప్రేక్షకుల్ని నవ్విస్తూనే భయపెడుతూ కొంత మంది దర్శకులు విజయాలు సాధించారు. ఈ ఒరవడికి శ్రీకారం చుట్టిన రాఘవ లారెన్స్ కూడా చాలా వరకు కామెడీ హారర్ థ్రిల్లర్‌లలో సక్సెస్‌లు సొంతం చేసుకున్నారు. అయితే `పిండం` మాత్రం అందుకు పూర్తి భిన్నంగా భయపెట్టడమే ప్రధానంగా సాగింది. క్లైమాక్స్‌లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సినిమాకు కీలకంగా నిలిచాయి. అయితే ఈ కథలో కొత్తదనం లేకపోవడం గమనార్హం.
కథలో ఆంథోని కుటుంబం ఓ ఇంట్లోకి వచ్చాక అక్కడ వారికి ఆత్మలు కనిపించడం, వాటి వల్ల ఆంథోనీ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కోవడం భయాన్నికలిగించాయి. ఈ సన్నివేశాలని రూపొందించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే పదే పదే అదేతరహా సంఘటనలు జరగడం, ఆత్మలని పసిగట్టి అన్నమ్మ రావడంతో ద్వితీయార్థంలో ఏదో జరుగుతుందనే ఆసక్తిని కలిగించారు. కానీ ద్వితీయార్థంలోనూ అదే తరహా సన్నివేశాలు ఉండటంతో ప్రేక్షకుడికి చిరాకొస్తుంది. ఇక కడుపులో ఉన్న పిండానికి, బయట ఉన్న ఆత్మకు లింక్ పెట్టడం అనేది లాజిక్‌గా లేదు. భయపెట్టే సన్నివేశాలు, నటీనటుల నటన, నేపథ్య సంగీతం బాగున్నా కొత్తదనం లేని కథ, కథనం, భావోద్వేగాలు అంతగా పండకపోవడంతో `పిండం` చెప్పినంత స్కేరియస్ట్ ఫిలిం అనిపించుకోలేకపోయింది.
పంచ్ లైన్:అంత స్కేరియెస్ట్ కాదు బ్రో
రేటింగ్: 2.5