KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దెదించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేసీఆర్ పనిపట్టే కార్యక్రమాలకు తెరతీసింది. కాళేశ్వరంలో అవినీతి, అక్రమాలు సహ కేసీఆర్ హయాంలో చేపట్టిన వివిధ పథకాలు, అనుమతులు, కాంట్రాక్టులు, ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. అలాగే కేసీఆర్ కనుసన్నలో నడిచిన పోలీస్ వ్యవస్థపై కూడా నిఘా వేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష నేతలు, సొంత నేతలపైనా నిఘా ఉండేదని అంటుంటారు. ఇంటలిజెన్స్ విభాగంలో ఫోన్ ట్యాపింగ్ కు ఓ స్పెషల్ వింగ్ ఉండేదని చెబుతుంటారు. రేవంత్ రెడ్డి, స్టిఫెన్ సన్ సంభాషణలను రికార్డు చేయడం..అవి బయటకు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పదేళ్లపాటు సాగిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ సర్కార్ పూర్తిగా బయటకు లాగినట్టు సమాచారం.
సోమవారం రాత్రి దుగ్యాల ప్రణీత్ రావు అనే డీఎస్పీని పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. ఈయన కేసీఆర్ కుటుంబసభ్యుల్లో ఒకరని భావిస్తున్నారు. ప్రణీత్ రావు నేతృత్వంలోనే ఈ ట్యాపింగ్ కథ నడిచిందని చెబుతున్నారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి అంతర్గతంగా విచారణ జరిపిన ప్రభుత్వం..ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదికలు రావడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అప్పట్లో ఎస్ఐబీలో దుగ్యాల ప్రవీణ్ రావుదే ఆధిపత్యం అని తెలుస్తోంది. ఎస్ఐబీ పేరుతో ఉండే పవర్స్ ను దుర్వినియోగం చేశారని తేలడంతో వెంటనే ఆయన్ను సస్పెండ్ చేశారు. తదుపరి చర్యలు తీవ్రంగానే ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ లో ప్రవీణ్ రావు పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.