AP Phone Tapping : ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ కలకలం.. ప్రధాన సూత్రధారి ఆయనే అంటున్న టీడీపీ నేతలు
AP Phone Tapping : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ పలువురు అధికారులు అరెస్ట్ కావడం, కొందరు జంప్ కావడం చూస్తున్నాం. ఇక ఈ డొంక ఎక్కడ కదులుతుందోనని గత ప్రభుత్వ పెద్దల గుండెలు అదురుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈక్రమంలో ప్రతిపక్ష నేతల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు టీడీపీ-జనసేన-బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బొండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు..టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆధారాలను బయటపెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ సీతారామంజనేయులు నేతృత్వంలో ఫోన్ల ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందన్నారు. గతంలో తాము ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నామని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాధ్ సైతం చెప్పారని గుర్తుచేశారు. గత తెలంగాణ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొన్నప్పుడే ఏపీ సీఎం జగన్ కూడా అదే తరహా సాఫ్ట్ వేర్ కొన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తామిచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇదే సమావేశంలోకి ఓ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ రావడంతో ఎందుకు వచ్చారని టీడీపీ నాయకులు నిలదీశారు. ఐజీ పంపితేనే వచ్చానని సదరు కానిస్టేబుల్ చెప్పడం గమనార్హం.
కాగా, ఇదే విషయమై కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. ఆంజనేయులతో సహా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన అధికారులను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.