PhonePe-Google Pay : ఫోన్ పే, గూగుల్ పే ఆధిపత్యానికి చెక్ పడనుందా?
PhonePe-Google Pay : దేశంలో డిజిటల్ శకం నడుస్తోంది. ప్రపంచంలోనే అతి ఎక్కువ నెటిజన్లు మన దేశంలో ఉన్నారు. అంతంత మాత్రం చదువుకున్న వారు సైతం సోషల్ మీడియాను వాడుతుండడం, డిజిటల్ పేమెంట్లు చేస్తుండడం గమనార్హం. డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. టీ కొట్టులో పది రూపాయల దగ్గర నుంచి లక్షల రూపాయలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సామాన్య జనాలు సైతం చేసేస్తున్నారు. ఈరంగంలో ఈ రెండు సంస్థలదే ఆధిపత్యం అని చెప్పవచ్చు. ఇటీవలి కాలం వరకు పేటీఎం వీటికి కొంత పోటీ ఇచ్చినా ఆర్ బీఐ ఆంక్షల మూలంగా పోటీలో వెనకపడింది.
దీంతో యూపీఐ లావాదేవీల్లో విలువపరంగా ఈ రెండు సంస్థల వాటా 86 శాతానికి పెరిగింది. వీటి గుత్తాధిపత్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈక్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) రంగంలోకి దిగింది. వీటి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఫిన్ టెక్ స్టార్టప్ లతో త్వరలో భేటీ కానుంది. యూపీఐ లావాదేవీల్లో గుత్తాధిపత్యంపై ఇటీవల ఆర్ బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్యానల్ సైతం ఇదే అంశాన్ని గతంలో లేవనెత్తింది. ఈ నేపథ్యంలో ఎన్ పీసీఐ ప్రతినిధులు క్రెడ్ , ఫ్లిప్ కార్ట్, జొమాటో, అమెజాన్, ఇతర ఫిన్ టెక్ సంస్థలతో భేటీ కానున్నారు. ఈ భేటీకి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలను ఆహ్వానించలేదని ‘టెక్ క్రంచ్’ వెబ్ సైట్ పేర్కొంది. తమ వేదికలపై యూపీఐ లావాదేవీల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే ఆయా సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది.
మార్కెట్ వాటా పెంచుకోవడానికి యూజర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రోత్సహిస్తోంది. మరో వైపు డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో 30 శాతం పరిమాణ పరిమితి పాటించేందుకు ఇచ్చిన గడువు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది. మొత్తం యూపీఐ లావాదేవీల పరిమాణంలో 30 శాతానికి మించి ఒక థర్డ్ పార్టీ యాప్ కలిగి ఉండరాదని 2020 నవంబర్ లో ఎన్పీసీఐ పరిమితి తీసుకొచ్చింది. దీన్ని పలుమార్లు పొడిగించుకుంటు వచ్చింది. ఈక్రమంలో గడువు త్వరలోనే ముగియనుండడంతో తన వంతు చర్యలకు రెడీ అయ్యింది.