Nitish Kumar : ఆంధ్రా యువ కెరటం నితీశ్ కుమార్ రెడ్డికి జాతీయ జట్టుకు ఎంపికైన సంబురం ఎంతో సేపు నిలువలేదు. కెరీర్ తొలినాళ్లలోనే జాతీయ జట్టుకు ఎంపికై తెలుగు వారు సత్తా చాటడంతో అంతా సంతోషించారు. కానీ గంటల వ్యవధిలోనే గాయాల బారిన పడ్డాడని పక్కనపెట్టడంతో అందరిలో నిరాశ అలుముకుంది. జింబాబ్వేతో టీ-20 సిరీస్ కు ఎంపికైన నితీశ్ స్థానంలో శివం దూబేను ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ విషయాన్ని బీసీసీఐ బుధవారం ప్రకటించింది.
వైజాగ్ కు చెందిన పేస్ బౌలింగ్, అల్ రౌండర్ నితీశ్ రెడ్డి ఐపీఎల్-2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరుఫున అద్భుత ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆడిన తొలి టోర్నీలో తన అల్ రౌండ్ ప్రతిభతో ఔరా అనిపించాడు. ఈ 21 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్, పేస్ బౌలర్ ఐపీఎల్ లో ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిజన్ 2024’ అందుకోవడం గమనార్హం. ఐపీఎల్ లో నిలకడగా ఆడిన నితీశ్ జనాలనే కాదు సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో జింబాబ్వేలో జరిగే టీ-20 టోర్నీ కోసం ఎంపిక చేశారు. టీమిండియా టీ-20 జట్టుకు ఎంపికైన తొలి ఆంధ్ర క్రికెటర్ గా నితీశ్ చరిత్రకెక్కాడు. ప్రస్తుతం అతడు గాయంతో బాధపడుతున్నట్లు బీసీసీఐ ప్రకటించి తెలుగువారి ఉత్సాహాన్ని నీరుగార్చారు.
నితీశ్ చికిత్స నిమిత్తం ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలో అతడి ప్లేస్ లో శివం దూబేను భర్తీ చేశారు. అయితే నితీశ్ భవిష్యత్ క్రికెట్ తారగా నిలుస్తాడనడంలో సందేహం లేదు. ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ, నిలకడగా ఆడితే ఈ టోర్నీ కాకపోయినా వచ్చే వాటికైనా ఎంపిక కావడం ఖాయం.
కాగా, జింబాబ్వే టూర్ కు సీనియర్లకు రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ..జట్టులో యువకులకు చాన్స్ ఇచ్చింది. ఈ జట్టుకు శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. జూలై 6 నుంచి జింబాబ్వేతో ఐదు మ్యాచ్ ల టోర్నీని ఆడనుంది.