Prashant Kishore:వైసీపీ కొత్త ఏడుపు..వైసీపీ చీకొడితే టీడీపీ తెచ్చుకుంటోందట
Prashant Kishore:ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. వరుస సమీకరణాలు, నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చండీయాగం చేయడం..వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ శనివారం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లడం, ఆయనతో కలిసి ప్రత్యేకంగా భేటీ కావడం వంటి పరిణామాలతో ఏపీలో రాజకీయ హీట్ పెరిగింది. ఇంత వరకు వైసీపీకి రాజకీయ ప్యూహ కర్తగా ఉన్న పీకే ఉన్నట్టుండి టీడీపీ వైపు టర్న్ కావడం ఏంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
చండీయాగంతో దైవబలాన్ని, ప్రశాంత్ కిషోర్‌తో ప్యూహాత్మక బలాన్ని అందిపుచ్చుకున జగన్‌పై చంద్రబాబు యుద్ధానికి రెడీ అవుతున్నారా? అనే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా జరుగుతోంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత వేస్తున్న అడుగులు చేస్తున్న యాగాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం రాజకీయ ప్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కావడంతో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే సంకేతాలు మొదలయ్యాయి.
అయితే తాజా పరిణామాలపై వైసీపీ నేతల వాదన మరోలా ఉంది. మేము చీ కొడితేనే ప్రశాంత్ కిషోర్‌ని వాళ్లు తెచ్చుకుంటున్నారని, ఆ పీకే (పవన్ కల్యాణ్) ఈ పీకే (ప్రశాంత్ కిషోర్) వైసీపీని ఏమీ చేయలేరని మండిపడుతున్నారు. అంబటి రాంబాబు తాజా పరిణామాలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పీకే చంద్రబాబును కలవడం విచిత్రంగా ఉందన్నారు. అంతే కాకుండా గతంలో పీకే గురించి నారా లోకేష్ మాట్లాడిన తీరుని ఒక సారి గుర్తు చేసుకోవాలన్నారు. ఎంత మంది పవన్ కల్యాణ్‌లు వచ్చినా.. ఎంత మంది పీకేలు వచ్చినా టీడీపీని బతికించే అవకాశం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, లోకేష్ ఎంతకు దిగజారుతున్నారో స్పష్టమౌతోందన్నారు.
ఇక వైసీపీ మరో నేత పేర్ని నాని పీకేపై సెటైర్లు వేశారు. మేము చీకొట్టిన వ్యక్తిని వాళ్లు తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ గతంలో ప్రశాంత్ కిషోర్ గురించి ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు. మాకు ఎవడి సహాయం అవసరం లేదన్న లోకేష్ ఇప్పుడు ఎవడి సహాయం అర్థిస్తున్నారో అర్థమదుతోందంటూ సెటైర్లు వేశారు. మేము ఛీ కొడితే బయటికి వెళ్లిన వాడిని బ్రతిమిలాడి తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్‌పై నమ్మకం లేకే పీకేను రంగంలోకి దించుతున్నారని పంచ్‌లు వేశారు.