Chandrababu : ఏపీలో ఇవాళ పండుగ వాతావరణం నెలకొంది. ఇక అమరావతి పరిసరాలైతే పసుపుమయం అయిపోయాయి. ఎటుచూసినా టీడీపీ అభిమానులతో కిక్కిరిసిపోయింది. నాలుగోసారి చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను అంతమొందించి నవ్యాంధ్ర సారథిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు చంద్రబాబుపై తమకున్న అభిమానాన్ని ఘనంగా, వినూత్నంగా చాటుకుంటున్నారు.
గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గరలోని కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. సభా ప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దాదాపు లక్షమంది దాక తిలకించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో జై టీడీపీ.. జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. ఇదిలా ఉండగా అమరావతి ఇసుక పడవల యజమానులు చంద్రబాబుపై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. కృష్ణా నదిలో 30 పడవలతో ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ర్యాలీ నిర్వహించి ప్రమాణ స్వీకారోత్సవానికి తరలివెళ్లారు. టీడీపీ జెండాలను కట్టి జై చంద్రబాబు నినాదాలతో సందడి చేశారు. చంద్రబాబు ఏపీ సీఎం కావడంతో తమకు మళ్లీ ఉపాధి లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
అలాగే చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన ఓ అభిమాని చంద్రబాబుపై తన అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని తన ఆర్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. భారీ వస్త్రంపై చంద్రబాబు నాయుడు చిత్రాన్ని పెయింటింగ్ చేసి ప్రదర్శించారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చంద్రబాబుపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రపథాన నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అమరావతిని రాజధానిగా హైదరాబాద్, బెంగళూరులకు దీటుగా చంద్రబాబు తయారు చేస్తారని నమ్ముతున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తారని ఆకాంక్షిస్తున్నారు. అవినీతి రహిత పాలన, ప్రజాపాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతుందని ఆశిస్తున్నారు.