CM Chandrababu : ప్రజల డేటా అనుసంధానించాలి : సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ)పై సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీ అనేది ప్రభుత్వానికి రియల్ టైమ్ డేటా అందించే ఏకైక వనరుగా పని చేయాలని అన్నారు. అన్ని విభాగాల్లోని డేటాను ఒక వేదికపైకి తీసుకొచ్చి అనుసంధానం చేసి, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డేటా ద్వారా విశ్లేషించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డేటా వనరుగా ఉండాలని తెలిపారు. పౌరులు ఇప్పటికి కూడా తమకు కావాల్సిన ధ్రువీకరణ పత్రాల కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని, ఈ విధానం మారాలన్నారు.
ఆర్టీజీఎస్ అనేది ప్రభుత్వానికి ఒక సదుపాయ సాధనంగా, అన్ని వేళల సహాయకారిగా పనిచేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తెచ్చి వారికి కావాలసిన సేవలన్నీ సులభంగా అందేలా చేయనుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 లక్షల మంది పౌరులకు సంబంధించి ేటా లేదని అధికారులు చెప్పగా, ఈ డేటాను సత్వరం సేకరించి అనుసంధానించే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. 90 రోజుల్లో విద్యార్థులు క్యూఆర్ కోడ్ ద్వారా తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు పొందేలా కూడా చర్యలు చేపడుతున్నాయని, ఈ పనులు వేగవంతంగా చేస్తున్నామని వివరించారు. మార్చి నెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అధికారులు వివరించారు.