Chandrababu Letter : ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలువాలి..ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

Chandrababu Letter
Chandrababu Letter : ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్న మొన్నటి వరకు హోరెత్తిన మైకులు మూగబోయాయి. ఓటేసేందుకు ఓటర్లంతా తమ ఊర్లకు పయనమయ్యారు. తమ ఐదేళ్ల భవిష్యత్ కోసం ఓటేసేందుకు ఈ సారి పెద్ద మొత్తంలో ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ నిబంధనల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ముమ్మర తనిఖీలు జరుపుతున్నారు. రేపు పోలింగ్ జరగనుండగా టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అంటూ నినదించారు. ఈ ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి, భవిష్యత్ తరాల అభ్యున్నతికి అత్యంత కీలకమైనవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మీ భవిష్యత్తును, మీ సంక్షేమాన్ని కాంక్షించే శ్రేయోభిలాషిగా ఈ బహిరంగ లేఖ రాస్తున్నానన్నారు.
ఒకవైపు విభజన కష్టాలు, మరోవైపు ఆర్థిక లోటుతో 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయాణం మొదలు పెట్టింది. సుపరిపాలనతో అనతికాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్థి పథం వైపు నడిపించాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసి, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పరుగులెత్తించి, రహదారులను నిర్మించి,పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చి ఉపాధి కల్పించాం. ప్రజా రాజధాని అమరావతి, పోలవరం పనులను శరవేగంతో చేపట్టాం. ప్రతి వర్గానికి ప్రయోజనం కల్పించేలా 100కు పైగా సంక్షేమ పథకాలు అమలు చేశాం. 2019లో తిరిగి తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉంటే అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండేవాళ్లం. అలాంటి కీలక సమయంలో మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
అధికారం చేపట్టిన తొలి గంట నుంచే విధ్వంసం, నిరంకుశ పాలనకు తెరలేపారు. మీ జీవితాలను మార్చడానికి మీరు ఇచ్చిన అధికారాన్ని తన దోపిడీకి సాధనంగా మార్చుకున్నారు. నేడు వైసీపీ భస్మాసురుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. అందుకు మనకు వచ్చిన అవకాశమే మే 13న జరుగుతున్న ఎన్నికలు. రాష్ట్రాన్ని కాటువేసిన వైసీపీ ప్రభుత్వంపై ప్రతి ఒక్కరు ఓటుతో వేటు వేయాలి. మే 13న మీరు వేసే ఓటు కబ్జాలకు, బాదుడుకు, అరాచకాలకు ముగింపు పలకాలి. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ఎజెండాతో మీ ముందుకు వచ్చిన కూటమిని ఆశీర్వదించమని కోరుతున్నా. వచ్చే ఐదేళ్లూ రాష్ట్రం కోసం ఏం చేయాలి? రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయంలో కూటమి వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉంది. విజన్ ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను నిండు మనసుతో ఓటేసి గెలిపించండి’’ అంటూ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.