CM Revanth Reddy : తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛ అని, ఇక్కడి ప్రజలు బబానిసత్వాన్ని అసలే భరించరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం రాష్ట్ర ప్రజల తత్వమని అన్నారు. సంక్షేమం ముసుగులో చెరబట్టాలని చూస్తే ఇక్కడి సమాజం సహించదన్నారు. ఇందిరా పార్కులో ధర్నాలకు అనుమతినిచ్చినట్లు చెప్పారు. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామన్నారు. తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను సీఎం రేవంత్ విడుదల చేశారు. తెలంగాణ డ్రీమ్-2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణను 3 జోన్లుగా విభజన చేస్తున్నట్లు సీఎం రేవంతె రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు ప్రాంతం వరకు సబ్ అర్బన్ తెలంగాణ, రీజినల్ రెంగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూడు ప్రాంతాలకూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని తెలిపారు. త్వరితగతిన రీజినల్ రింగు రోడ్డు పూర్తి చేస్తామన్నారు.