Jagan : నీడనిచ్చిన చెట్టునే నరకడం మనుషుల నైజం..రాజకీయాల్లో ఇలాంటి వారు ఎక్కువే ఉంటారు. తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపైనే దుమ్మెత్తిపోస్తుంటారు. ఇలాంటి కోవకు చెందినవారే ఏపీ సీఎం జగన్. రాష్ట్రాన్నే కాదు.. తన కుటుంబాన్ని చీలుస్తున్నారని జగన్ రెడ్డి నాలుగున్నర కోట్ల ప్రజాధనం స్పాన్సర్ షిప్ గా పెట్టి నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ లో మొసలి కన్నీరు కార్చారు.
షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు కానీ.. మూడేండ్ల కిందనే తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారు. మరి అప్పుడు ఎవరు కుటుంబాన్ని చీల్చుకున్నారు. తల్లిని పార్టీ గౌరవాధ్యక్షురాలి బాధ్యతల నుంచి బలవంతంగా తప్పించి.. పంపించేసినప్పుడు కుటుంబాన్ని ఎవరు చీల్చుకున్నారు? కనీసం వారు వేరుగా వెళ్తున్నారని తెలిసిన తర్వాతనైనా.. తనతో వారికి వచ్చిన ఇబ్బంది ఏమిటని అడిగి తెలుసుకున్నారా? వారిని ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు.
తల్లిని, చెల్లిని కలుపుకుని కుటుంబంగా ఉందామని ఎందుకు అనుకోలేదు. షర్మిల వెళ్లిపోయి తెలంగాణలో రాజకీయం చేస్తే కుటుంబాన్ని తాను చీల్చుకున్నట్లుగా కాదు.. కానీ ఆమె మళ్లీ కాంగ్రెస్ లో చేరి ఏపీలో రాజకీయం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చినట్లు. జగన్ రెడ్డి తీరు చూసి కాంగ్రెస్ నేతలకు ఎలా ఉందో కానీ. అలాంటి కుటుంబాన్ని పెంచిపోషించినందుకు. .అడ్డగోలుగా వేల కోట్ల అక్రమ సంపాదన చేసుకునేందుకు సహకరించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ శిక్ష పడాల్సిందేనని ఎక్కువ మంది భావిస్తున్నారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ కుటుంబమే లేదు. వైఎస్ ప్రమాదంలో చనిపోయే వరకూ కాంగ్రెస్ నే అట్టిపెట్టుకుని ఉన్నారు. ఆయన చనిపోయిన మరుక్షణమే..జగన్ రెడ్డి కాంగ్రెస్ పై కుట్రలు ప్రారంభించారు. ఆయనకు వేరే ఆలోచనలే లేకపోతే చనిపోయిన రోజు నుంచే ..ఓదార్పు యాత్ర కోసం.. శవాల లెక్క ప్రారంభించరు. కచ్చితంగా కాంగ్రెస్ పై కుట్ర చేసే.. ఆయన శవాల లెక్కలేసుకున్నారు.
ఈక్రమంలో సోనియాపై నిందలేశారు. వైఎస్ ను చంపేశారని కూడా ఆరోపించారు. ఘోరమైన విమర్శలు చేశారు. చివరకు అన్న చేసిన మోసానికి బలైన షర్మిల మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లినా కాంగ్రెస్ నే నిందిస్తున్నారు. ఏ చెట్టు మీద ఎదిగారో జగన్ ఆ చెట్టుపైనే నిందలు వేస్తున్నారు. ఆ చెట్టు నిందలు పడుతుంది. అలాంటి మైండ్ సెట్ ఉన్నవారిని ప్రోత్సహించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ గతి పట్టాల్సిందేనని ఎక్కువ మంది అభిప్రాయం. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడుతారని అంటారు. అది ఇటు జగన్ విషయంలోనూ, అటు కాంగ్రెస్ లోనూ జరుగుతుంది.