Chandrababu : జగన్ ను ప్రజలు నమ్మడం లేదా? చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Chandrababu : సీఎం జగన్ తన మంత్రులు, ఎమ్మెల్యేలను నమ్మడం లేదు. ప్రజలు ఆయనను నమ్మడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కదలి రా పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో విచ్చేశారు. వారిని ఉద్దేశించి బాబు ప్రసంగించారు. రాష్ట్రంలో జగన్ వల్ల అందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన తప్పుడు నిర్ణయాలు ప్రజలకే కాదు వారి మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం నచ్చడం లేదు.
మంత్రులను తన ఇష్టానుసారం మారుస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపితే వారు గెలుస్తారా? ఇక్కడ చెల్లని పైస అక్కడ ఎలా చెల్లుతుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మూడు రాజధానులంటూ ఆంధ్రప్రదేశ్ ను అధోగతి చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతిని బలిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐటీ రంగాన్ని డెవలప్ చేసి ఎంతో మందిని నిపుణులను తయారు చేస్తే ఇప్పుడు జగన్ ఐటీని నిర్వీర్యం చేశారు. ఒక్క ఐటీ కంపెనీ కూడా ఏపీకి రాకుండా చేశారు. దీంతో ఐటీ రంగం కునారిల్లుతోంది. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు. జగన్ పేరు చెబితే చాలు పారిపోతున్నారు. అలాంటి నియంత పాలన మనకు అవసరమా? అని ప్రశ్నించారు. జగన్ ఓటు వేస్తే మీకే నష్టం వస్తుందని వివరించారు.
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఎన్టీఆర్. దాన్ని పాడు చేస్తుంది మాత్రం జగనే. అప్పుల రాష్ట్రంగా చేసిన జగన్ పాలన మనకు వద్దంటే వద్దని సూచించారు. జగన్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు మనకు చేటు చేస్తున్నాయి. దేశప్రజల ముందు సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. దీనికి చరమగీతం పాడాలి. అధికార మార్పు రావాలి. దీనికి మీరే ఆయుధంగా కావాలని చంద్రబాబు వివరించారు.