Democracy : ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు.. అధికారం ఉందికదా అని విర్రవీగితే..

Democracy

Democracy

Democracy : ప్రజాస్వామ్యంలో సాధ్యం కానిది ఏదీ లేదు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు ఇంటికి పంపించేస్తారు. ప్రజలు ఎప్పుడూ తెలివిగలవారే. ఎప్పుడు ఎవరికి అధికారం ఇవ్వాలో వారికే ఇస్తారు. ప్రజలపై అజమాయిషీ చేసే వారిని, ఉచితాల పేరిట ప్రలోభపెట్టేవారికి ఎన్నికల్లో బుద్ధి చెబుతారు. అలా మొన్నటిదాక అధికార మత్తులో జోగిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన శాస్తి చేశారు. నిరుద్యోగులు, ఉద్యోగులను అస్సలు పట్టించుకోకపోవడమే కాదు వారి ఏ రోజూ వారి సమస్యలను పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల్లో ఆ పార్టీ చావుదెబ్బతింది.

అధికారం ఉన్నప్పుడే నాయకులు, నేతలు పార్టీల వెంబడి ఈగల్లా ముసురుకుంటారు. ఎప్పుడైతే అధికారం కోల్పోతారో ఆ పార్టీని వదులుతారు. నాయకులు కూడా తెగ ముదిరిపోయారు. విలువలు గట్రా ఏమి ఉండవు. తమ స్వలాభం కోసమే రాజకీయాలు చేస్తుంటారు. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకే జంప్ అవుతారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదే పనిలో ఉన్నారు.

మొన్నటిదాక బీఆర్ఎస్ పదవులు అనుభవించి, ఆ పార్టీ ఓడిపోగానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. పట్నం మహేందర్ రెడ్డి అనే నేతకు పిలిచి, బతిమాలి మారి మంత్రి పదవి కట్టబెట్టారు. అయినా కూడా బీఆర్ఎస్ తనకు మంత్రి పదవి ఇచ్చిందనే గౌరవం లేకుండా కాంగ్రెస్ లో చేరిపోయారు. వరంగల్ మేయర్ గా ఉన్న గుండు సుధారాణి కూడా అంతే. ఆమెకు పెద్దగా క్యాడర్ లేకున్నా..బీఆర్ఎస్ మేయర్ ను చేసింది. అయినా కూడా ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎవరో కూడా ప్రజలకు తెలియదు. కానీ బీఆర్ఎస్ అతడికి రెండు సార్లు ఎంపీ పదవి కట్టబెట్టింది. ఆయన ముఖం తెలియకున్నా ప్రజలు కారు గుర్తును చూసి ఓటేశారు. అలాంటి నేత కూడా పదవులు ఇచ్చినా బీఆర్ఎస్ ను వదిలి బీజేపీలో చేరిపోయారు.

అందుకే ప్రజాస్వామ్యంలో ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అనే సామెత కరెక్టుగా అతికిపోతుంటుంది. ఇదే బీఆర్ఎస్ విషయంలోనూ, కాంగ్రెస్ విషయంలోనూ జరిగింది. తెలంగాణ తమకు తప్ప మిగతా ఎవరికీ ప్రజలు ఓట్లు వేయరు అని బీఆర్ఎస్ పార్టీ అహంకారంతో విర్రవిగేది. ఏ ఎన్నికలు వచ్చినా తమదే విజయం అని పొంగిపోయేది. కానీ ఆ పార్టీ చేసిన కొన్ని స్వయంకృతాపరాధాల వల్ల ఆ పార్టీ తన ఓటమిని తానే స్వయంగా తెచ్చుకుంది. అంటే ఓడులు బండ్లు అయ్యాయన్నమాట.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఎవరూ అనుకోలేదు. ఆ పార్టీ అధినేతలకు సైతం నమ్మకం లేకుండేది. కానీ ఎప్పుడైతే ఉద్యోగ నోటిఫికేషన్ల లీకేజీలు, వాయిదాలు ఇలా నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారో..కాంగ్రెస్ కు అనూహ్యంగా మైలేజీ వచ్చింది. నిరుద్యోగులంతా కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓటేయ్యడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే బండ్లు ఓడలు అయ్యాయన్నమాట. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ప్రజల నిర్ణయమే ఫైనల్. ఇది ప్రస్తుత కాంగ్రెస్ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది.

TAGS