Pemmasani Chandrasekhar : సెంట్రల్ కేబినెట్ లోకి పెమ్మసాని? నేడు బాబుతో ఢిల్లీకి వెళ్లనున్న చంద్రశేఖర్..

Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 135 సీట్లు దక్కించుకున్న టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కూటమిలో ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీల సీట్లతో కలిపి 164 సీట్లు సాధించింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 9వ తేదీ (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు తమ భాగస్వామ్య కూటమి అయిన ఎన్డీయే సమావేశానికి వెళ్తున్నారు. అక్కడి పెద్దలతో సమావేశం అనంతరం తిరిగిరానున్నారు. అయితే ఆయనతో పాటు పెమ్మసానిని చంద్రబాబు తీసుకెళ్తున్నారు. దీంతో రాష్ట్రంలో కొత్త చర్చ మొదలైంది.

పెమ్మసాని చంద్రశేఖర్ అనే పేరు చాలా మందికి రెండేళ్ల క్రితం వరకు తెలియదు. గుంటూరు పార్లమెంటు సెగ్మెంట్ నుంచి అతను సాధించిన విజయంతో ప్రతీ ఒక్కరి దృష్టి ఆయన వైపునకు మళ్లింది. ప్రస్తుతం ఏపీలో అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. అతను సౌమ్యమైన, వాక్ చాతుర్యం కలిగిన నేతగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంతో కేంద్రంలో కూడా టీడీపీకి అవ‌కాశాలు పెరిగాయి. ఈ విషయంపై చర్చించేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఎన్డీయే కూటమిలో భాగమైన టీడీపీకి కేబినెట్ బెర్త్‌పై ఈరోజు ప్రధానాంశంగా చర్చ జరగబోతోందని తెలుస్తోంది.

చంద్రబాబుతో పాటు పెమ్మసాని ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పెమ్మసానికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించమని చంద్రబాబు అడిగే అవకాశం ఉందని ఏపీలో చర్చకు దారి తీసింది. పెమ్మసాని విద్యాధికుడు, మంచి వక్త, స్వాభిమానుడు, ఎటువంటి మచ్చలేని వ్యక్తి అటువంటి అర్హత కలిగిన వ్యక్తి ఎన్డీయే కేబినెట్ లోకి రావడం NDA ఇమేజ్‌ను మరింత పెంచుతుందని ఏపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్డీయే వర్గాలు దీనిపై ఎలా స్పందిస్తాయనేదానిపై వేచి చూడాలి. 

TAGS