Minister Ponguleti : అధికారుల నిర్లక్ష్యంతోనే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సరైన సమయంలో గేట్లు ఎత్తి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. పైనుంచి వచ్చే వరదను అంచనా వేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని అన్నారు.
నష్టానికి బాధ్యులైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. విచారణలో బాధ్యులుగా తేలిన అధికారులు శిక్షార్హులవుతారని, నష్టం జరిగిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని చెప్పారు. దాదాపు 400 ఎకరాల్లో ఇసుక మేట వేసిందని, ఇసుకను తొలగించేందుకు కొంత నగదు సాయం చేస్తున్నట్లు తెలిపారు. పత్తి, వరి నష్టపోయినవారికి విత్తనాలు ఉచితంగా ఇస్తామని, గొర్రెలకు రూ.3 వేలు, ఆవులు, గేదెలకు ఒక్కో దానికి రూ.20 వేలు ఇస్తామని ప్రకటించారు. సోమవారం ఉదయం సీఎంతో మాట్లాడి తక్షణ మరమ్మతులకు రూ.8 కోట్లు మంజూరు చేశామన్నారు. నీట మునిగి ఇళ్లు నష్టపోయినవారికి ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.