Pedakurapadu Public Pulse : పెదకూరపాడులో ఓటమి బాటలో వైసీపీ అభ్యర్థి.. ‘భాష్యం’ దే గెలుపు

Pedakurapadu Public Pulse Bhashyam Praveen Victory This Time
Pedakurapadu Public Pulse : ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ,జనసేన, బీజేపీ జట్టు కట్టడంతో వైసీపీ ఓటమి దాదాపు ఖరారైనట్టే అని జనాల నాడిని బట్టి తెలుస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో అందరి కళ్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరపాడుపై పడింది. టీడీపీ కూటమి నుంచి భాష్యం ప్రవీణ్, వైసీపీ నుంచి నంబూరు శంకరరావు బరిలో ఉన్నారు. వీరిద్దరూ సమీప బంధువులు కావడం విశేషం. వీరు వరుసకు మామా అల్లుళ్లు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. అయితే గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ప్రత్యర్థులుగా పోటీ చేయడం.. ఓట్ల చీలిక కలిసొచ్చి.. పెదకూరపాడు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి నంబూరు శంకరరావు గెలిచారు. అయితే ఈసారి భాష్యం ప్రవీణ్ ను పోటీలోకి దించడంతో నియోజకవర్గ రాజకీయం మరింత రంజుగా సాగుతోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నంబూరుకు వ్యతిరేకంగా, నియోజకవర్గ సమస్యలపై ఆందోళనలు నిర్వహించి టీడీపీలో యాక్టివ్ రోల్ పోషించారు భాష్యం ప్రవీణ్. సెగ్మెంట్ లో తన ట్రస్ట్ తరుపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ట్రై సైకిళ్లు, తోపుడు బళ్ల పంపిణీ వంటివి చేసి జనాల ఆదరణ చూరగొన్నారు.

Bhashyam Praveen
భాష్యం ప్రవీణ్ కు టికెట్ రావడంతో నంబూరు ఓటమి ఖాయమని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ప్రవీణ్, శంకరరావు మామా అల్లుళ్లు అవుతారు. ఇద్దరిదీ కూడా తాటికొండ మండలం పెదపరిమినే. నంబూరుపై టీడీపీ నుంచి ప్రవీణ్ పోటీలోకి దిగడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వారి బంధుగణం, కుల సమీకరణలు ఆయనకు కలిసిరానున్నాయి.
భాష్యం ప్రవీణ్ బరిలో దిగడంతో ఓటమి భయంతో వైసీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిస్తున్నట్లు టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇరవై రోజుల కిందట ఓ రోజు రాత్రి అనంతవరం, దోడ్లేరు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కు చెందిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో టీడీపీ కూటమికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక పెదకూరపాడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్థానికులే అంటున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని, ఆయన అవినీతి పనులు, ఇసుక, మైనింగ్ దోపిడీ వంటి వాటిపై కూడా స్థానిక ఓటర్లు గుర్రుగా ఉన్నారు.
మరోసారి ఆయనకు అవకాశం ఇస్తే తమ కంటితో తామే పొడుచుకున్నవారమవుతామని స్థానికులు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నంబూరుకు ఓటేసే అవకాశం లేదని అంటున్నారు. యువకుడైన భాష్యం ప్రవీణ్ కు ఈ సారి నియోజకవర్గ ఓటర్లు గంపగుత్తగా ఓట్లు వేసే అవకాశం ఉందని అంటున్నారు. నంబూరుపై భాష్యం ప్రవీణ్ గెలుపు ఎప్పుడో ఖరారైందని, ఇప్పుడు చేసే ప్రచారమంతా మెజార్టీని పెంచుకోడానికేనని టీడీపీ శ్రేణులు ధీమాగా చెప్తున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలను భరించే స్థితిలో జనం లేరని, పెదకూరపాడులో ఇది మరింత ఉందని, అందుకే నంబూరును ఇంటికి పంపించేందుకు నియోజకవర్గ ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది. టీడీపీ గెలిచే సీట్లలో పెదకూరపాడులో భారీ మెజార్టీ నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ప్రవీణ్ రాకతో నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అయినట్టు చెపుతున్నారు.