JAISW News Telugu

Pedakurapadu Ground Report : పెదకూరపాడు వైసీపీలో అసమ్మతి పోరు..

Pedakurapadu Ground Report

Bhashyam Praveen Vs Shankar Rao

Pedakurapadu Ground Report : ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ,జనసేన, బీజేపీ జట్టు కట్టడంతో వైసీపీ ఓటమి దాదాపు ఖరారైనట్టే అని జనాల నాడిని బట్టి తెలుస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో అందరి కళ్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరపాడుపై పడింది. టీడీపీ కూటమి నుంచి భాష్యం ప్రవీణ్, వైసీపీ నుంచి నంబూరు శంకరరావు బరిలో ఉన్నారు. వీరిద్దరూ సమీప బంధువులు కావడం విశేషం. వీరు వరుసకు మామా అల్లుళ్లు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

పెదకూరపాడు (Pedakurapadu) నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. అయితే గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ప్రత్యర్థులుగా పోటీ చేయడం.. ఓట్ల చీలిక కలిసొచ్చి.. పెదకూరపాడు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి నంబూరు శంకరరావు గెలిచారు. అయితే ఈసారి భాష్యం ప్రవీణ్ ను పోటీలోకి దించడంతో నియోజకవర్గ రాజకీయం మరింత రంజుగా సాగుతోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నంబూరుకు వ్యతిరేకంగా, నియోజకవర్గ సమస్యలపై ఆందోళనలు నిర్వహించి టీడీపీలో యాక్టివ్ రోల్ పోషించారు భాష్యం ప్రవీణ్.  సెగ్మెంట్ లో తన ట్రస్ట్ తరుపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ట్రై సైకిళ్లు, తోపుడు బళ్ల పంపిణీ వంటివి చేసి జనాల ఆదరణ చూరగొన్నారు.

భాష్యం ప్రవీణ్ కు టికెట్ రావడంతో నంబూరు ఓటమి ఖాయమని  స్థానికులు చెబుతున్నారు. భాష్యం ప్రవీణ్ బరిలో దిగడంతో ఓటమి భయంతో వైసీపీ అభ్యర్థి నంబూరు శంకరరావు నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిస్తున్నట్లు టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా నంబూరు శంకరరావుకు సొంత పార్టీ నేతలే పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వైసీపీ నాయకులు నంబూరికి షాక్ ల మీద షాకులు ఇస్తున్నారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్.. భాష్యం ప్రవీణ్ కు పూర్తిగా మద్దతు ఇస్తుండడంతో నంబూరుకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని అంటున్నారు. అలాగే వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా భాష్యం ప్రవీణ్ కే మద్దతు ఇస్తామని అంటుండడంతో నంబూరుకు ఏం చేయాలో పాలుపోవడం లేదని తెలుస్తోంది.

భాష్యం ప్రవీణ్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగిస్తూ ప్రజల మద్దతు చూరగొంటుండడంతో వైసీపీలో కలవరం మొదలైంది. దీంతో నంబూరు అనుచరులు నియోజకవర్గ వ్యాప్తంగా వలంటీర్ల ద్వారా కుక్కర్లు, నగదు, మిక్సీలను ఇంటింటికి ప్రచారం చేసినట్టు సమాచారం. శంకరరావుకు ఓటమి దాదాపు ఖరారు కావడంతో ఫ్రస్టేషన్ లో అరాచకాలకు ఒడిగడుతున్నారు.

ఇరవై రోజుల కిందట ఓ రోజు రాత్రి అనంతవరం, దోడ్లేరు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కు చెందిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే నియోజకవర్గం పరిధిలోని క్రోసూరులోని తెలుగు దేశం పార్టీ కార్యాలయాన్ని తగల బెట్టేందుకు అధికార వైసీపీ కార్యకర్తలు

ప్రయత్నించారు. కార్యాలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన తాటాకు పందిరికి ఆదివారం రాత్రి 11.30గంటల సమయంలో నిప్పు పెట్టారు. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడి పందిరి పూర్తిగా కాలిపోయింది. అయితే ఈ మంటలు కార్యాలయానికి అంటుకునే లోగా ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. దీంతో కార్యాలయానికి మంటలు వ్యాపించినా భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో పెదకూరపాడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇక పెదకూరపాడు (Pedakurapadu) నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్థానికులే అంటున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని, ఆయన అవినీతి పనులు, ఇసుక, మైనింగ్ దోపిడీ వంటి వాటిపై కూడా స్థానిక ఓటర్లు గుర్రుగా ఉన్నారు. మరోసారి ఆయనకు అవకాశం ఇస్తే తమ కంటితో తామే పొడుచుకున్నవారమవుతామని స్థానికులు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ నంబూరుకు ఓటేసే అవకాశం లేదని అంటున్నారు. యువకుడైన భాష్యం ప్రవీణ్ కు ఈ సారి నియోజకవర్గ ఓటర్లు గంపగుత్తగా ఓట్లు వేసే అవకాశం ఉందని అంటున్నారు. నంబూరుపై భాష్యం ప్రవీణ్ గెలుపు ఎప్పుడో ఖరారైందని, ఇప్పుడు చేసే ప్రచారమంతా మెజార్టీని పెంచుకోడానికేనని టీడీపీ శ్రేణులు ధీమాగా చెప్తున్నాయి.

Exit mobile version