Pawan Kalyan : ఏపీలో ఎన్నికల సందడి మాములుగా లేదు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను వడివడిగా ప్రకటించేస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించింది. ఇక కూటమి పార్టీలు కూడా అభ్యర్థులను వేగంగా ప్రకటించేందుకు వేగంగా పావులు కదుపుతున్నాయి. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గట్టాయి. సీట్ల సర్దుబాటు కొలిక్కిరావడమే కాదు ఎవరికి వారు అభ్యర్థుల ప్రకటనను కూడా పూర్తిచేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.
ఈక్రమంలో నిన్న జనసేనాని పవన్ కల్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. యువ పారిశ్రామిక వేత్త, ఇన్నాళ్లు పవన్ కు వెన్నుదన్నుగా ఉన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును అధికారికంగా ప్రకటించారు. అయితే ఇక్కడి నుంచి సానా సతీశ్ పోటీ చేయాలని భావించారు. నియోజకవర్గంలో కలియదిరిగారు కూడా. తీరా ఉదయ్ పేరును పవన్ ప్రకటించేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశాడని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కాగా, సానా సతీశ్ కు సీటు ఇవ్వకుండా ఆర్థిక పరిపుష్టి ఉన్న ఉదయ్ శ్రీనివాస్ వైపే పవన్ మొగ్గుచూపారు. అలాగే ఈయన పిఠాపురం సీటు నుంచి పోటీ చేయాలని భావించారు. దీంతో అతనికి సర్దిచెప్పి అక్కడ్నుంచి పవన్ పోటీ చేస్తున్నారు. ఇక ఉదయ్ శ్రీనివాస్ ‘టీ టైమ్’ యజమాని అని అందరికీ తెలిసిందే. దుబాయ్ లో పెద్ద కొలువు చేసి టీ షాపుల ఫ్రాంచైజీని ప్రారంభించాడు. 5లక్షల పెట్టుబడితో మొదలైన ఈ బిజినెస్ ఇప్పుడు కోట్లకు చేరింది.