Political Retirement : భీమవరంలో జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న చేసిన పలు వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలు వివిధ రకాలుగా జనాల్లోకి వెళ్లిపోతున్నాయి. జగన్ ను విమర్శించడం పక్కన పెడితే, ఎన్నికల్లో డబ్బుల ఖర్చు కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే రాజకీయాల్లో సీనియర్లు రిటైర్ మెంట్ తీసుకుని కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని చేసిన కామెంట్స్ ను కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు.
నిన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సీనియర్లు ఎన్నికల నుంచి రిటైర్ మెంట్ తీసుకుని కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని పరోక్షంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి అన్నారు. తాను కూడా సినిమాల్లో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడానికి సినిమాలను తగ్గించుకున్నానన్నారు. అయితే పవన్ కామెంట్స్ పై వివిధ విశ్లేషణలు బయలుదేరాయి.
రాజకీయాల్లో సీనియర్లు ఉండాలని, వారి అనుభవం పాలనలో అక్కరకు వస్తుందని కొందరు అంటున్నారు. వయసు మళ్లిన వారు రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే అది చంద్రబాబుకు కూడా వర్తిస్తుంది కదా..మరి ఆయన్ను రిటైర్ మెంట్ తీసుకోవాలని, తనలాంటి వారికి చాన్స్ ఇవ్వాలని పరోక్షంగా చంద్రబాబుకు హింట్ ఇస్తున్నారా అని అడుగుతున్నారు. రాజకీయాల్లో అనుభవజ్ఞులు ఉంటే అవినీతి రహిత పాలన అందుతుందని, పాలనలో వారి అనుభవం పనికి వస్తుందని అంటున్నారు.
70 ఏండ్లకు పైబడిన మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని, ఆయన ఇంతవరకు ఒక్క అవినీతి మరక లేదని అంటున్నారు. అలాగే 2014లో చంద్రబాబు వంటి సీనియర్ అయితేనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడని జనాలు భావించారు కాబట్టే ఆయన గెలిపించారని అంటున్నారు. పాలనలో అనుభవం అనేది రాష్ట్రానికి, దేశానికి మంచే చేస్తుందని చెప్పుకొస్తున్నారు.
అయితే పవన్ వ్యాఖ్యల్లో దురుద్దేశం లేకపోయినా.. రాజమండ్రి రూరల్, అర్బన్ సీట్లను జనసేన కోరుతోంది. అక్కడ గోరంట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగ్ స్థానాలను జనసేనకు ఇవ్వబోమంటూ గోరంట్ల చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన్ను ఉద్దేశించి సీనియర్లు జూనియర్లకు అవకాశం ఇవ్వాలని పవన్ వ్యాఖ్యానించారు. అయితే ఇది అనూహ్యంగా చంద్రబాబుకు పరోక్షంగా చురకలాగా ఉపయోగపడిందని కొందరు కామెంట్ చేస్తున్నారు.