Pawan Sacrifice : పవన్ మరీ ఇంత త్యాగమా?
Pawan Sacrifice : జగన్ గద్దె దించడమే లక్ష్యంగా పవన్ త్యాగాల మీద త్యాగాలు చేస్తున్నారు. పవన్ ను సీఎంగా చూడాలని ఫ్యాన్స్ కు చిరకాల కోరిక. ఆయన సీఎం అయితే పేదలకు, యువతకు న్యాయం చేస్తారని, పాలనలో మార్పు తీసుకొస్తారని భావించారు. అందుకే వారు పవన్ ను సీఎం చేయడమే జీవిత లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కానీ వారి ఆశలకు గండిపోతోంది. వారి లక్ష్యం నెరవేరేలా కనపడడం లేదు.
రాబోయే ఎన్నికల్లో జనసేన విజయదుందుభి మోగించి పవన్ సీఎం అవుతారని ఆశించారు. కానీ క్షేత్రస్థాయిలో జనసేన బలాన్ని అంచనా వేసుకున్న పవన్ ఒంటరిగా వెళ్తే జగన్ ను ఢీకొట్టడం అసాధ్యమని టీడీపీతో పొత్తు సై అన్నారు. ఒకే పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా గెలవచ్చని జనసైనికులు కూడా భావించారు. పొత్తు పెట్టుకున్నారు సరే..కనీసం 60 సీట్లు, సీఎం పదవిలో వాటా ఇస్తారు అనుకున్నారు. కానీ ఇదీ జరగలేదు. చివరకు 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లకు ఫైనల్ అయ్యింది. అయితే ఇందులో మరొకసారి త్యాగం చేయాల్సి వచ్చింది.
బీజేపీ కోసం 24 సీట్లలో మరో 3 స్థానాలను త్యాగం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు జనసేన కేవలం 21 స్థానాల్లోనే పోటీ చేయనుంది. మరో ఎంపీ సీటును కూడా బీజేపీ త్యాగం చేయగా 2 ఎంపీ సీట్లలోనే బరిలోకి దిగబోతోంది. ప్రస్తుతం బీజేపీ 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ, జనసేన కలిపి 31 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాల్లో బరిలో నిలువనున్నాయి.
పార్టీ పెట్టి పదేళ్లు అయినా ప్రభావం చూపని జనసేనకు ఈ ఎన్నికలు మంచి అవకాశం. గత ఐదేళ్లలో పవన్ గ్రాఫ్ పెరిగింది. ఆయన ఒంటరిగా పోటీ చేస్తే మంచి సీట్లే రాబట్టేవారు. అది పార్టీకి చాలా హెల్ప్ అయ్యేది. ఇప్పుడు కాకపోయినా మరోసారికైనా పవన్ పార్టీ ప్రధానంగా మారే అవకాశం ఉండేది. కానీ జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా త్యాగాల మీద త్యాగాలు చేసి తన పార్టీ అవకాశాలను కుదించుకున్నారు. పవన్ త్యాగం జగన్ ను గద్దె దించడానికి, చంద్రబాబును గద్దె ఎక్కించడానికి ఉపయోగపడుతుంది తప్ప పవన్ కు ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆయనకే తెలియాలి. మరి దీన్ని జనసైనికులు, కాపు సామాజిక వర్గ నాయకులు ఎలా తీసుకుంటారో చూడాలి.