Pawan Residence in Chebrolu : ఏపీలో ఎన్నికల ప్రచారంలో నేతలంతా బిజీబిజీ అయ్యారు. ఎన్నికలకు మరో 37 రోజుల సమయం ఉండడంతో తీరిక లేకుండా ప్రచార బరిలో పాల్గొంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రచారంలో ముందుండి గెలుపు ఉట్టి కొట్టే పనిలో ఉంది. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రసంగాలు జనాలను ఉర్రూతలూగించడమే కాదు ఆలోచింపజేస్తున్నాయి కూడా.
ఇక జనసేనాని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, జనంలోనే బతికేందుకు తన నివాసాన్ని పిఠాపురం నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకోసం ఒక బిల్డింగ్ ను రెడీ చేశారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్..ఇక అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటానని ఇటీవల ఆయన ఓ మీటింగ్ లో ప్రకటించారు. దీంతో నేతలు ఆయన నివాసం కోసం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఓ మూడంతస్తుల భవనాన్ని ఎంపిక చేశారు.
ఈ భవనం పవన్ వీరాభిమాని, జనసేన కార్యకర్త అయిన ఓదూరి నాగేశ్వరరావుకు చెందింది. దీనినే పవన్ తన నివాసంగా మార్చుకోబోతున్నారు. పిఠాపురం వచ్చినప్పుడు పవన్ ఇక్కడే బస చేసేందుకు, పార్టీ కార్యాలయాన్ని కూడా ఈ భవనంలోనే ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. పొలాల మధ్య ఈ భవనం ఉండడంతో పార్కింగ్ కు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని దీన్ని ఎంపిక చేశారు. పార్టీ తరపున ఉగాది పండుగను సైతం ఈ భవనంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవల జ్వరం బారిన పడ్డ జనసేనాని పవన్ కల్యాణ్ ఈనెల 7 నుంచి విజయయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. 9వ తేదీన పిఠాపురం వచ్చి పవన్ ఉగాది వేడుకల్లో పాల్గొనేలా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ భవన యజమాని ఓదూరి నాగేశ్వరరావు పవన్ కు వీరాభిమాని కావడంతో తనకు అద్దె కూడా అవసరం లేదని చెప్పారంటున్నారు. ఎన్ని వాహనాలైన పార్కింగ్ చేసుకునే అవకాశం ఉండడంతో దీన్ని ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. ఈ భవనంలో ఇటీవలే గృహప్రవేశం చేశారని, త్వరలోనే పవన్ ఈ నివాసం నుంచి తన కార్యకలాపాలను ప్రారంభిస్తారని తెలుస్తోంది. భవనానికి దగ్గరలోనే హెలిప్యాడ్ ను కూడా నిర్మిస్తున్నారు.