Pawan : ముఖాముఖిగా తలపడనున్న పవన్.. ప్రకాష్ రాజ్.. ఆందోళనలో ఓజీ టీమ్
Pawan and Prakash Raj : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడు సినిమాల షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. గత ఏడాది నుంచి బిజీగా ఉన్న పవన్ కల్యాణ్..ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఇక తమ అభిమాన హీరో నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు పవన్ కల్యాన్ గుడ్ న్యూస్ చెప్పాడు. హరిహర వీరమల్లు సెట్ లోకి అడుగు పెట్టి.. తన పోర్షన్ షూటింగ్ చేస్తున్నాడు. దీంతో పవర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరో పక్క ఓజీ సినిమా కూడా పవన్ పోర్షన్ షూట్ చేయాల్సి ఉంది.
అయితే హరిహర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనిపై అటు పవన్ కల్యాన్, ఇటు నటుడు ప్రకాష్ రాజ్ మధ్య నెట్టింట వాదోపవాదాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ తిరుమల లడ్డూ వివాదంపై చెన్నైలో చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. తాను చేసిన ట్వీట్ ను మరోసారి చదువుకొని చర్చకు రమ్మంటు ప్రకాష్ రాజ్ పవన్ కల్యాన్ కు సవాల్ విసిరాడు.
అయితే వీరిద్దరూ ముఖాముఖిగా తలపడబోతున్నారు. అయితే అది రాజకీయ వేదికపై కాదు. ఓజీ సినిమా షూటింగ్ లో.. ఓజీ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర చేస్తున్నాడు. అయితే పవన్, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ సీన్లు ఉండడంతో ఇప్పుడు ఓజీ మేకర్స్, దర్శకుడు ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ ఎన్ని విమర్శలు చేసినా పవన్ వాటిని సూచనలుగానే తీసుకున్నాడు. నటుడిగా ప్రకాష్ రాజ్ అంటే తనకెంతో ఇష్టమని వకీల్ సాబ్ ఈవెంట్లో పవన్ కల్యాన్ స్వయంగా చెప్పుకొచ్చాడు. కానీ చెన్నైలో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు పవన్ ను వ్యక్తిగతంగా హర్ట్ చేశాయని సన్నిహితులు చెబుతున్నారు. ప్రకాష్ రాజ్ తో ఇప్పటికిప్పుడు షూటింగ్ చేయడానికి పవన్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో సీన్లు పూర్తవుతాయా లేదా అని ఓజీ టీమ్ ఆందోళన చెందుతున్నది.