Pawan Kalyan : వైఎస్ జగన్ హయాంలో వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో వలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో వలంటీర్లతో ధర్నాలు, రాస్తారోకోలు చేయించింది. వారికి అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై వలంటీర్లు కోర్టును ఆశ్రయించారు.
వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గతేడాది జూలై 9న ఏలూరులో జరిగిన వారాహి సభలో వలంటీర్ల గురించి పవన్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా కేసు నమోదైంది. ‘రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు. అసాంఘిక శక్తులకు వలంటీర్లు సహకరిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేటి విచారణ సందర్భంగా విచారణపై స్టే ఇచ్చిన హైకోర్టు పవన్ కు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. తర్వాతి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇలాంటి కేసులను ప్రభుత్వం సవరిస్తోందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఇందులో పవన్ కళ్యాణ్ సహా పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ఉపయోగించిన గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను పునఃసమీక్షించడం కూడా ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు పవన్ కేసుపై స్టే విధించింది.
గత ప్రభుత్వం అన్యాయంగా తనపై కేసు పెట్టిందని పవన్ లీగల్ టీం వాదించింది. హైకోర్టు సమీక్ష వరకు గుంటూరు కోర్టులో విచారణను నిలిపివేయాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ సవరణలు, సమర్పించిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ కేసులో స్టే విధించి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.