Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు కోట్లలో అప్పు..జనసేనాని ఆస్తుల వివరాలివే..
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన ఇమేజ్ శిఖరాగ్రాన్ని చేరింది. జానీ నుంచి గబ్బర్ సింగ్ దాక దశాబ్దం పాటు బ్లాక్ బస్టర్ హిట్ లేకున్నా ఆయన ఫ్యాన్ బేస్ అలాగే ఉండడం ఒక్క పవన్ కు మాత్రమే సాధ్యం. అందుకే ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ నిర్మాత, దర్శకుడు కోరుకుంటారు. ఇక ఆయన సినిమాకు రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటారు. ఇక రాజకీయాల్లోనూ పవన్ అంతే ప్రత్యేకతను కలిగిఉన్నారు. సమాజ మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్..ఈసారి విజయకేతనం ఎగురవేయాలని భావిస్తున్నారు.
ఈమేరకు మంగళవారం పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన పేరిట ఉన్న ఆస్తులు, అప్పులు అలాగే గత ఐదేళ్లలో తన ఆదాయం, చెల్లించిన పన్నుల వివరాలను క్షుణ్ణంగా అందులో పొందుపరిచారు. దీని ప్రకారం గత ఐదేళ్లలో పవన్ కల్యాణ్ సంపాదన రూ.114,76,78,300. ఇందుకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47,07,32,875, జీఎస్టీకి రూ.26,84,70,000 చెల్లించారు. ఇక జనసేన అధినేతకు రూ.64,26,84,453 అప్పులు ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నవి రూ.46కోట్ల 70లక్షలు ఉన్నాయి.
ఇక వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం రూ.20 కోట్లకు పైగానే విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు రూ.17,15,00,000 ఉన్నాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద బీమాలాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాల్లో విరాళాలు ఇచ్చారు.
అలాగే వివిధ సంస్థలకు రూ.3,32,11,717 విరాళాలు అందజేసినట్టు తన నామినేషన్ పత్రాల్లో చూపించారు పవన్ కల్యాణ్. అందులో కేంద్రీయ సైనిక్ బోర్డు- రూ.1 కోటి, పీఎం సిటిజన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్ -రూ.1 కోటి, ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధి- రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి-రూ.50లక్షలు, శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్- రూ.30,11,717. పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్సలెన్స్-రూ.2లక్షలు.