Pawan Kalyan : పవన్ పిఠాపురం వెళ్లి వైసీపీకి ప్రచారం చేశారా..! అసలు మతలబేంటి?
Pawan Kalyan : జనసేన అధినేత, మహాకూటమి నాయకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. 2019 ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి రెండు చోట్ల కూడా ఓడిపోయారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తపడుతున్నారు. దీనిలో భాగంగా కాపు కులస్తులు అధికంగా ఉండే పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ విసృతంగా పర్యటించారు.
ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలుకరించిన పవన్ కల్యాణ్.. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగ గెలిచిన తర్వాత తన స్నేహితులతో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ కట్టిస్తానని ప్రజలకు పవన్ హామీ ఇచ్చారు. 5 రోజుల పాటు పిఠాపురంలోనే మకాం వేసిన జనసేన అధినేత తన గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ నేతలతో చర్చించారు.
నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కొద్ది దూరం ఆటోలో ప్రయాణం చేశారు. ఆ తర్వాత తన కన్వాయ్ లో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఎడ్ల బండ్లను చూసి కారు ఆపి మరీ వారితో ముచ్చటించారు. పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించి వీడియోలను జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఈ వీడియోలపై వైసీపీ నేతలు తమ దైన శైలిలో స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆటోలో ప్రయాణించిన రోడ్డులో ఎక్కడ కూడా రోడ్డుపై గుంతలు కనిపించలేదని.., జనసేన ర్యాలీ సందర్భంగా కూడా రోడ్డు అద్భుతంగా ఉందని.. ఈ విషయం తాము చెప్పడం లేదని.. జన సైనికులు పోస్ట్ చేసిన వీడియోల్లోనే స్పష్టంగా కనిపించిందని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు.
ఎక్కడో ఒకచోట రోడ్డు బాగాలేకపోతే దాన్ని భూతద్దంలో టీడీపీ, జనసేన చూపించింది. ఇప్పుడు వారే వీడియోలను పోస్ట్ చేయడం, అందులో రోడ్డు బాగా ఉండడం ఆనందంగా ఉందంటూ వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ పిఠాపురం వచ్చి తమకు ప్రచారం చేసినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. వైసీపీ చేసిన ఈ కామెంట్లపై జనసేన కార్యకర్తలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.